- టారిఫ్‌ల చర్యలపై అమెరికన్లకు ట్రంప్ సూచనలు
- మరిన్ని దిగుమతి సుంకాలు వుంటాయని హెచ్చరిక
పామ్ బీచ్ : కెనడా, మెక్సికో, చైనాలపై తాను విధించిన అదనపు టారిఫ్‌ల వల్ల తలెత్తిన వాణిజ్య యుద్దంతో అమెరికన్లకు కొంచెం బాధ కలుగుతుందని, కానీ వారు ఆ భారాన్ని మోయక తప్పదని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ‘బాధ వుంటే వుండొచ్చు, కానీ అమెరికాను మళ్ళీ మహత్తర దేశంగా మేం తీర్చి దిద్దుతాం. చెల్లించాల్సిన ధరకు ఇది పూర్తి విలువను కలిగి వుంటుంది. అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య మిగులు లేకుండా కెనడా ఉనికిలో వుండబోదని వ్యాఖ్యానించారు. మంగళవారం నుండే ఈ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.
ఆ మూడు దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ తీసుకున్న చర్యలతో దశాబ్దాలుగా ఉత్తర అమెరికాలో సాగుతున్న వాణిజ్య బంధాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన ఆగ్రహావేశాలు, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.
ఇంకా తీవ్రమైన దిగుమతి సుంకాలు విధించే అవకాశం వుందని హెచ్చరించారు. యురోపియన్ యూనియన్‌పై కచ్చితంగా దిగుమతి సుంకాలు వుంటాయని, బ్రిటన్‌తో కూడా వుండే అవకాశం లేకపోలేదని ఆయన విలేకర్లతో అన్నారు. కెనడా నుండి ప్రతీకార చర్యలు ఎదురయ్యే అవకాశాలను తోసిపుచ్చారు. ”వారు ఆట ఆడాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. వారు కావాలనుకునే ఆటలన్నింటినీ మేం ఆడగలం.” అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడా నుండి వాషింగ్టన్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, టారిఫ్‌లను ఎత్తివేయడానికి గానూ కెనడా, మెక్సికోలతో వాణిజ్య అసమాతనలను కూడా తుడిచిపెట్టాల్సిన అవసరం వుందని అన్నారు. తాజాగా తాను తీసుకున్న చర్యల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణం గురించి వివరణ ఇస్తూ, స్వల్ప కాల వ్యవధిలో మనకు కొంత బాధ వుండొచ్చు, కానీ ప్రజలు దాన్ని అర్ధం చేసుకుంటారు, కానీ, దీర్ఘకాలంలో అమెరికాను దాదాపు ప్రపంచంలోని ప్రతీ దేశమూ మోసగించిందని ఆయన వ్యాఖ్యానించారు.
మెక్సికోకు ఊరట.. సుంకాల విధింపు తాత్కాలికంగా నిలిపివేత
మెక్సికో, కెనడాలతోపాటు చైనాపైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో మెక్సికోకు ప్రస్తుతానికి తాత్కాలికంగా భారీ ఊరట లభించింది. మెక్సికోపై సుంకాల విధింపును నెల రోజులపాటు నిలిపివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో స్నేహపూర్వక ఫోన్ కాల్ చర్చలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. షీన్‌బామ్ సైతం ఇదే విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
మెక్సికో నుంచి అమెరికాకు మాదకద్రవ్యాలు.. ముఖ్యంగా ఫెంటానిల్ అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే 10 వేల మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించనున్నట్లు షీన్‌బామ్ తెలిపారు. అమెరికా సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు. తమ దేశంపై సుంకాల విధింపు నెలరోజుల కాలానికి నిలిచిపోయిందని, ఈ సమయంలో ఇరుపక్షాల ప్రతినిధులు వాణిజ్యం, భద్రత తదితర అంశాలపై చర్చలు నిర్వహిస్తారని వెల్లడించారు.