స్యామ్‌సంగ్‌ ఉద్యోగులు ఉద్యమబాట

Jun 8,2024 08:45 #Samsung employees, #strike

-వేతనాల కోసం తొలిసారి నిరసనలు
సియోల్‌ : దక్షిణ కొరియాలోని స్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. వేతన పెంపు కోరుతూ నిరసనలు చేపట్టారు. అనేక మంది ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపు 10 మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్‌ స్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌ఇయు) ఆధ్వర్యంలో సియోల్‌లోని స్యామ్‌సంగ్‌ ప్రధాన కార్యాలయం వద్ద కూడా పలువురు ఉద్యోగులు నిరసన తెలిపారు. ‘శ్రమను గౌరవించండి!, మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. న్యాయబద్ధమైన వేతనాలు ఇవ్వండి చాలు’ అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు తీసుకున్నారని, ఆందోళన క్రమంగా విస్తరిస్తోందని ఎన్‌ఎస్‌ఇయు అధ్యక్షులు సోన్‌ వూమెక్‌ మీడియాకు తెలిపారు. వేతనాల పెంపుపై జనవరి నుంచి కార్మికుల యూనియన్‌, యాజమాన్యం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 5.1 శాతం వేతన పెంపును అమలు చేశామని, కానీ యూనియన్లు అదనపు రోజు వార్షిక సెలవు, పనితీరు ఆధారిత బోనస్‌లు కోరుతున్నాయని యాజమాన్యం వాదిస్తోంది. అయితే కార్మికుల సమ్మె కారణంగా ఉత్పతిపై ఎలాంటి ప్రభావం లేదని యాజమాన్యం చెబుతుంది. అయితే స్యామ్‌సంగ్‌లో కార్మికుల సమ్మె చాలా అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. స్యామ్‌సంగ్‌లో సుమారు 50 ఏళ్ల పాటు కార్మికుల యూనియన్లను నిషేధించారు. అయితే 2010లో అప్పటి దేశ అధ్యక్షులు మూన్‌ జె-ఇన్‌ చొరవ కారణంగా యూనియన్లు ఏర్పాటయ్యాయి. ఎన్‌ఎస్‌ఇయులో 28 వేల ఉద్యోగులు ఉన్నారు. ఇది మొత్తం స్యామ్‌ సంగ్‌ శ్రామిక శక్తిలో ఐదో వంతుతో సమానం. అలాగే సంస్థలో ఉన్న ఐదు యూనియన్లలో ఇదే అతి పెద్దది. సమ్మె గురించి యూనియన్ల నాయకులు మాట్లాడుతూ సమ్మెతో ఉత్పత్తికి అంతరాయం కలిగించమని, అది మా ఉద్దేశ్యం కాదని చెప్పారు.

➡️