అమెరికాలో ఉద్యోగాల తెగ్గోత..

Jan 24,2024 10:51 #America, #Scarcity of jobs
  • ఐటి వర్గాల్లో తీవ్ర ఆందోళన
  • గతేడాది తొలగింపుల్లో 98 శాతం పెరుగుదల
  • 2024లోనూ ఉద్వాసనలే..!
  • బోనస్‌లకు ఎగనామం

వాషింగ్టన్‌ : పెట్టుబడిదారి అగ్రదేశం అమెరికాలో ఉద్యోగులకు కనీస భద్రత లేకుండా పోతోంది. గడిచిన రెండేళ్లలో లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడగా.. ఈ ఏడాది మరిన్ని ఉద్వాసనాలు కొనసాగనున్నాయని తాజా ఓ రిపోర్ట్‌ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘ఛాలెంజర్‌ గ్రే అండ్‌ క్రిస్మస్‌’ నివేదిక ప్రకారం.. అమెరికా కంపెనీలు గతేడాది దాదాపు 7,21,677 మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2022లో నమోదయిన 3,63,832 తొలగింపులతో పోలిస్తే ఇది 98 శాతం అధికమని ఛాలెంజర్‌ గ్రే అండ్‌ క్రిస్మస్‌ వెల్లడించింది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా, అమెజాన్‌ సహా టెక్‌ రంగంలోని కంపెనీలే దాదాపు 1,68,032 మందిని ఇంటికి పంపించాయని తెలిపింది. ఈ సంఖ్య ఏడాదికేడాదితో పోల్చితే 73 శాతం ఎక్కువ. మరోవైపు 2023లో 34 శాతం యాజమాన్యాలు తమ ఉద్యోగులకు బోనస్‌లను ఎగ్గొట్టాయి.

‘ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఉద్యోగ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా చిన్న చిన్న స్టార్టప్స్‌ నుంచి పెద్ద టెక్‌ కంపెనీల వరకూ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో 2024 ఉద్యోగ మార్కెట్‌ మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది.’ అని ఛాలెంజర్‌ గ్రే అండ్‌ క్రిస్మస్‌’ పేర్కొంది. ‘కార్మికుల వ్యయం ఎక్కువ. కాబట్టే ఈ ఏడాది సైతం సంస్థలు పొదుపు చర్యలకు దిగనున్నాయి. 2024 జనవరి నుంచి మార్చితో ముగియనున్న త్రైమాసికంలో భారీగా నియామకాలు తగ్గించి.. మరోవైపు ఉన్న సిబ్బందికి ఎసరు పెట్టే యోచనలో ఉన్నాయి. కోవిడ్‌-19 వంటి సమయాల్లో ఓ వెలుగు వెలిగిన ఐటి రంగం ప్రస్తుతం కృత్రిమ మేధ టెక్నాలజీతో నేల చూపులు చూస్తోంది. ఆర్ధిక మాంద్యం, ప్రాజెక్ట్‌ల లేమి వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న ఆయా టెక్‌ కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకునే యోచనలో పడ్డాయి. ఈ నేపథ్యం లోనే ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నా యి.’ అని’ ఛాలెంజర్‌ గ్రే అండ్‌ క్రిస్మస్‌ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆండీ ఛాలెంజర్‌ అన్నారు.

రిటైల్‌, తయారీలోనూ వేటు..

గతేడాది 2023లో రిటైల్‌ కంపెనీలు ఏకంగా 78,840 మంది ఉద్యోగులపై వేటు వేశాయి. ఇంతక్రితం ఏడాది ఉద్వాసనలతో పోల్చితే 274 శాతం పెరిగాయి. 2024లోనూ అదే పరిస్థితి కొనసాగనుందని ఆండీ ఛాలెంజర్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత హెల్త్‌కేర్‌, ఉత్పత్తుల తయారీ రంగాలు ఉద్వాసనలకు పాల్పడనున్నాయని అంచనా వేశారు. ఆస్పత్రులు సహా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో తొలగింపులు 91 శాతం పెరిగి 58,560గా నమోదయ్యాయి. ‘అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితులే ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. డిమాండ్‌ సన్నగిల్లి పలు స్టోర్లు మూతపడటం, వ్యాపారాల దివాలా, ఎఐ తదితర అంశాలు ఉద్యోగులపై కత్తివేలాడేలా చేసింది.’ అని ఛాలెంజర్‌ గ్రే అండ్‌ క్రిస్మస్‌ నివేదిక పేర్కొంది.

టిక్‌టాక్‌లోనూ కోతలు..

ఈ ఏడాదిలో ఇప్పటికే గూగుల్‌, అమెజాన్‌, యూనిటీ, డిస్‌కార్డ్‌ వంటి టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. ఈ జాబితాలో తాజాగా వీడియో షేరింగ్‌ వేదిక టిక్‌టాక్‌ చేరింది. లాస్‌ఏంజెల్స్‌, న్యూయార్క్‌, అస్టిన్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పని చేస్తున్న దాదాపు వంద మంది ఉద్యోగులపై టిక్‌టాక్‌ వేటు వేసింది. ఆర్ధిక మందగమనం నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా టిక్‌టాక్‌ ఉద్వాసనలకు పాల్పడిందని ఎన్‌పిఆర్‌ రిపోర్ట్‌ పేర్కొంది. సంస్థ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా సేల్స్‌, అడ్వర్టైజింగ్‌ విభాగానికి చెందిన దాదాపు 60 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

➡️