ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే రిపబ్లికన్‌ సదస్సుకు గట్టి భద్రత

Jul 15,2024 23:30 #Donald Trump, #Republican Party

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో మిల్‌వాకేలో జరుగుతున్న రిపబ్లికన్‌ పార్టీ కీలక సదస్సుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సదస్సులో ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని రిపబ్లికన్‌ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నారు. భద్రతా పరంగా ఎలాంటి లోపం లేకుండా చూడాలని అధ్యక్షుడు బైడెన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ను ఆదేశించారు. విస్సాన్సిన్‌ రాష్ట్రంలోని మిల్‌వాకేలో సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు గురువారం వరకు కొనసాగుతుంది. ఇప్పటికే సిటీ సెంటర్‌లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు వీధులను మూసివేశారు. సదస్సు జరిగే కేంద్రం చుట్టూ డజన్ల సంఖ్యలో గస్తీ బృందాలు తిరుగుతున్నాయి.
సదస్సు చివరి రోజు గురువారం ట్రంప్‌ ప్రసంగించనున్నారు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ నామినీగా తన పేరును ఆ రోజు బహిరంగంగా ప్రకటించనున్నారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధి ఎవరో కూడా ప్రకటిస్తారు. ఆదివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ర్యాలీ సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. రిపబ్లికన్‌ పార్టీకే చెందిన 20ఏళ్ల యువకుడొకరు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన కుడి చెవికి గాయమైంది. వెంటనే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ అధికారి ఒకరు కాల్పులు జరిపిన దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. .

➡️