Canada: వాంకోవర్‌లో జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురు మృతి

Apr 27,2025 12:23 #Canada, #Car Rams, #Crowd, #festival, #Vancouver

ఒట్టావా :   కెనడాలోని వాంకోవర్‌లో వేడుక జరుపుకుంటున్న జనంపైకి కారు దూసుకెళ్లడంతో పలువురు మరణించారు. ఎంతమంది మరణించారన్న సమాచారం తెలియాల్సి వుంది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి 8.00 గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. లాపు-లాపు వేడుక సందర్భంగా పలువురు ఫిలిప్పీన్స్‌ కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో వాంకోవర్‌లోని ఇ-41 అవెన్యూ మరియు ఫ్రాసర్‌ వీధికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దాడి జరిగిందా అన్న అంశాన్ని అధికారులు నిర్ధారించాల్సి వుంది. నల్లటి ఎస్‌యువి కారు వేడుక కోసం అక్కడికి చేరిన జనసమూహంపై దూసుకువచ్చిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. డ్రైవర్‌ ఆసియా యువకుడని, మానసిక వికలాంగుడిగా కనిపిస్తున్నట్లు  వెల్లడించారు.  16వ శతాబ్దానికి చెందిన వలసవాద వ్యతిరేకి,  ఫిలిప్పీన్స్‌ నేత దాతు లాపు-లాపు జ్ఞాపకార్థం  ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వేడుకను నిర్వహిస్తారు.

వాంకోవర్‌ ఘటనపై కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన, గాయపడిన వారికి, ఫిలిప్పీన్స్‌ కమ్యూనిటీకి, వాంకోవర్‌లోని ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

➡️