క్యూబాకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ పది లక్షల సంతకాల సేకరణ

  • క్యూబా రాయబారికి అందజేత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్‌ కాస్ట్రో రూజ్‌ భౌతికంగా దూరమై ఏడో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాకు సంఘీభావంగా ఎస్‌ఎఫ్‌ఐ ఒక మిలియన్‌ సంతకాల సేకరణతో ప్రచారం చేసింది. ‘క్యూబాను జీవించనివ్వండి’ పేరుతో అగ్రరాజ్య దాష్టీకాలను నిరసిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. సోమవారం నాడిక్కడ రిపబ్లిక్‌ ఆఫ్‌ క్యూబా రాయబారి హెచ్‌ఇ అల్జాండ్రో సిమాన్‌కాస్‌ మారిన్‌ను తన నివాసంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దేశంలోని క్యాంపస్‌లలో సేకరించిన సంతకాలను క్యూబా రాయబారికి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అందజేశారు. ప్రపంచమంతా వైద్యులను పంపిస్తూ, ఆరోగ్యరంగంలో విశేష సేవలందిస్తున్న క్యూబాను తీవ్రవాద స్పాన్సర్ల జాబితాలో అమెరికా పెట్టడం ఘోరమని, వెంటనే తొలగించాలని సంతకాల సేకరణ ప్రచారంలో కోరినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్‌ బిస్వాస్‌, ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణన్‌, సహాయ కార్యదర్శి ఆదర్శ్‌ ఎం సాజి, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి మయాంక్‌ ఆజాద్‌, మాజీ అఖిల భారత నాయకుడు ఎంఎ బేబీ, ఆర్‌ అరుణ్‌ కుమార్‌, డివైఎఫ్‌ఐ నాయకుడు సంజీవ్‌ కుమార్‌, ఎఐవైఎఫ్‌ ప్రధాన కార్యదర్శి తిరుమల రామన్‌ పాల్గొన్నారు.

➡️