ఐఎంఎఫ్‌ షరతులకు తలొగ్గిన షెహబాజ్‌ ప్రభుత్వం

May 15,2024 00:16 #Pakistan, #Shehbaz
  •  ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న ప్రధాని

ఇస్లామాబాద్‌ : ఏ ఆర్థిక విధానాలైతే పాకిస్తాన్‌ను పీకల్లోతు సంక్షోభంలోకి నెట్టాయో అవే విధానాలను పట్టుకుని షెహబాజ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వేలాడుతోంది. ఐఎంఎఫ్‌ నుంచి రుణం తీసుకున్నందుకు అది విధించిన షరతుల అమలులో బాగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకుంది. వ్యూహాత్మకంగా కీలకమైన పిఎస్‌యులను మినహాయించి మిగతా అన్నిటినీ అమ్మకానికి పెడుతున్నట్లు ప్రధాని షెహబాజ్‌ ప్రకటించారు. తొలుత నష్టాలు వస్తున్న ప్రభుత్వ సంస్థలనే ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఐఎంఎఫ్‌ ఒత్తిడికి తలొగ్గి పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌తో సహా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. మలి విడత రుణం కోసం ఐఎంఎఫ్‌తో చర్చలు ప్రారంభించిన మరుసటి రోజు ఈ ప్రకటన వెలువడింది.వ్యాపారం చేయడం ప్రభుత్వ పని కాదని, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి సానుకూల వాతావరణాన్ని కల్పించే ఫెసిలిటేటర్‌ పాత్రకే పరిమితం కావాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. . ప్రైవేటీకరణ కమిషన్‌తో సహకరించాల్సిందిగా అన్ని మంత్రిత్వ శాఖలను ఆయన ఆదేశించారు. బిడ్డింగ్‌, ఇతర ముఖ్యమైన చర్యలతోసహా పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పిఐఎ) ప్రైవేటీకరణ క్రమాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేయాల్సిందిగా ప్రధాని ఆదేశించారు. పిఐఎ ప్రైవేటీకరణ తుది దశలో వుందన్నారు.

➡️