బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌లో ఆమెకున్న ఆస్తులతో పాటు, కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ముదిరిన నిరసనల కారణంగా … గతేడాది ఆగస్టు 5 న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజీనామా అనంతరం, ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక సంఘం డిప్యూటీ డైరెక్టర్ మోనిరుల్ ఇస్లాం, హసీనా ఆస్తులను సీజ్ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై మంగళవారం మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ విచారణ నిర్వహించి, హసీనా ఆస్తులను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం … హసీనా కుటుంబానికి చెందిన ‘సుధాసదన్’ భవనం సహా ఇతర ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. హసీనా భర్త, అణు శాస్త్రవేత్త ఎం.ఏ. వాజెద్ మియాకు ‘సుధా మియా’ అనే మరో పేరు ఉంది. అందుకే, ఆయన నివాసానికి ‘సుధాసదన్’ అనే పేరు పెట్టారు.
ప్రయాణ నిషేధం.. బ్యాంకు ఖాతాల జప్తు
హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జారు, కుమార్తె సైమా వాజెద్ వుతుల్, సోదరి షేక్ రెహానా, ఆమె కుమార్తెలకు చెందిన ఆస్తులపై కూడా ప్రయాణ నిషేధం విధించారు. హసీనా, ఆమె కుటుంబ సభ్యుల 124 బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఈ ఖాతాల్లో దాదాపు 600 కోట్ల బంగ్లాదేశ్ టాకా నిధులు ఉన్నట్టు తెలుస్తోంది.
తాత్కాలిక ప్రభుత్వం – అరెస్టు వారెంట్లు
హసీనా దేశం విడిచిన తరువాత మహమ్మద్ యూనస్ నేతఅత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో, హసీనా ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రులు, సలహాదారులు, అధికారులపై మానవత్వానికి విరుద్ధంగా నేరాలు చేశారని బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ వారెంట్ జారీ చేసింది. అలాగే, హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, దీనిపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఎలాంటి వ్యాఖ్య చేయలేమని ఇప్పటికే స్పష్టం చేశారు.