స్లొవేకియా ప్రధానిపై కాల్పులు

బ్రటిస్టా : గని తవ్వకాలు ఎక్కువగా జరిగే హండ్‌లోవా నగరంలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా బుధవారం స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో (స్మెర్‌)పై కాల్పులు జరిగాయని డెన్నిక్‌ ఎన్‌ డైలీ న్యూస్‌ వెల్లడించింది. సమావేశాలు జరుగుతున్న కల్చరల్‌ హౌస్‌ వెలుపల ప్రధానిపై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ భవనం వెలుపల ప్రధాని తన మద్దతుదారులతో మాట్లాడుతుంటే ఈ సంఘటన జరిగింది. పలుసార్లు తుపాకీ మోతలు వినిపించాయని పేర్కొంది. వెంటనే ఫికో నేలపై పడిపోయారని, దాంతో అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్ళారని తెలిపింది.
కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కాల్పుల కారణంగా బ్రటిస్లావాలో పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ లూబోస్‌ బాల్హా పార్లమెంట్‌ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ కాల్పులకు ప్రతిపక్షమే కారణమని బాల్హా విమర్శించారు. ”ఇది మీ తప్పే’ అని ఆయన ప్రతిపక్షంతో అన్నారు. పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ బిల్లుపై బుధవారం ఎంపీలు చర్చిస్తున్నారు. అధ్యక్షుడు జుజనా కపుటొవియా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నాలుగుసార్లు ప్రధానిగా చేసిన ఫికోపై దారుణంగా దాడి జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనతో తాను తీవ్రంగా దిగ్భ్రాంతి చెందానని వ్యాఖ్యానించారు.

➡️