- ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల మహాప్రదర్శన
- నిరసనలతో అట్టుడికిన పాక్ రాజధాని
- భద్రత బలగాల కాల్పులు..ఆరుగురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ రణరంగాన్ని తలపించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. లక్షలాది మంది రాజధాని రహదారులపై చేరుకోవడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు హింసకు పాల్పడటంతో సైన్యం రంగంలోకి దిగింది. భద్రత బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. మరణించిన వారిలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు వున్నారు. ఆదివారం నుండి దేశ రాజధానిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సెంట్రల్ ఇస్లామాబాద్‌లో వేలాదిమంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ఇప్పటివరకు నాలుగువేల మందికి పైగా మద్దతుదారులను అరెస్టు చేశారు. మొబైల్, ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేవారు. అశాంతిని అణచివేసేందుకు ర్యాలీలను నిషేధించారు. ప్రధాన మార్గాలను మూసివేశారు.
రాజధానిలోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన షిప్పింగ్ కంటెయినర్ల వలయాన్ని ఛేదించుకుని మద్దతుదారులు మంగళవారం లోపలకు ప్రవేశించారు. కాల్పులు జరుపుతామని హెచ్చరికలు చేసినప్పటికీ వారు పట్టించుకోకుండా భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగారు. ఫలితంగా హింస చెలరేగింది. ఏడాది కాలంగా జైల్లో వున్న ఇమ్రాన్ ఖాన్‌పై 150కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీకూడా రాజకీయ దురుద్దేశ్యాలతో మోపినవేనని ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) విమర్శిస్తోంది. కేవలం న్యాయస్థానాలు మాత్రమే ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయగలవని అధికారులు పేర్కొంటున్నారు.
ఇస్లామాబాద్ రెడ్‌జోన్‌లో కీలకమైన ప్రభుత్వ భవనాలు వున్న డి చౌక్‌ను మంగళవారం సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. ఆందోళనకారులు ఆయుధాలతో తలపడితే కాల్పులు జరపక తప్పదని హోం మంత్రి మోV్‌ాసిన్ నక్వి హెచ్చరించారు. తమ నేత ఆదేశాల మేరకు తాము రోడ్లపైకి వచ్చామని, తర్వాత ఏం చేయాలనేది ఆయనే నిర్ణయిస్తారని ఆందోళనకారుడు షజార్ అలీ వ్యాఖ్యానించారు. కాగా అరాచకవాదుల గ్రూపు ఉద్దేశ్యపూర్వకంగానే శాంతి భద్రతల అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోందని ప్రధాని షహబాజ్ షరీఫ్ విమర్శించారు.