సియోల్ : ఏకపక్షంగా మార్షల్‌లా విధించి సస్పెండయిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను లా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వందలాదిమంది దర్యాప్తు అధికారులు, పోలీసు అధికారులు బుధవారం అధ్యక్షుడి ప్రాంగణానికి చేరుకున్న దాదాపు ఐదు గంటల తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ కొరియా అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. భవనంలోకి వెళ్లడానికే మూడు గంటలు పట్టిందని పేర్కొంది. డిసెంబరు 3న జారీ చేసిన మార్షల్ లా డిక్రీపై ప్రశ్నించేందుకు హాజరుకావాల్సిందిగా అధికారులు పంపిన సమన్లను ఆయన ధిక్కరిస్తూ వచ్చారు. తన చర్యలపై దర్యాప్తు చేసేందుకు అవినీతి నిరోధక సంస్థకు అధికారం లేదంటూ తోసిపుచ్చుతూ వచ్చారు. హింసను నిరోధించేందుకే తాను ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున అధ్యక్ష భవనానికి చేరుకున్న దర్యాప్తు అధికారులు తొలుత అధ్యక్షుడి న్యాయవాదుల తో చర్చలు జరిపారు. ఆ తరువాత ఆయనను అరెస్టు చేయడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. అవినీతి నిరోధక సంస్థ కార్యాలయానికి వెళ్లడానికి ముందు యూన్ విడుదల జేసిన ఓ వీడియోలో దేశంలో చట్టబద్ధ పాలన కుప్పకూలిందని ఆరోపించారు.
