South Korea: 52 ఏళ్ల తర్వాత సియోల్‌ను తాకిన తీవ్రమైన మంచు తుఫాను

సియోల్‌ :   52 ఏళ్ల తర్వాత అత్యంత తీవ్రమైన నవంబర్‌ మంచు తుఫాను దక్షిణ కొరియా రాజధానిని బుధవారం తాకింది. వందలకొద్దీ విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
సియోల్‌లోని ఉత్తర ప్రాంతాలతో పాటు సమీప ప్రాంతాల్లో 20 సెం.మీ (17.8 అంగుళాలు) మేర మంచు కురిసినట్లు దక్షిణ కొరియా వాతావరణ సంస్థ తెలిపింది. 52 ఏళ్లలో సియోల్‌ ప్రజలు చూసిన అత్యంత భారీ మంచు తుఫాను ఇదేనని పేర్కొంది. 1972, నవంబర్‌ 28న వచ్చిన మంచుతుఫానుతో సియోల్‌లో 12 సెం.మీ (4.7 అంగుళాలు) మేర మంచు కురిసినట్లు తెలిపింది. గురువారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ప్రకటించింది.
దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాల్లో దాదాపు 10 నుండి 23 సెం.మీ (3.9 నుండి 9 అంగుళాలు) మేర మంచు కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. తూర్పు పట్టణంలోని హాంగ్‌చియోన్‌లో ఐదు వాహనాలు ఢకొీన్న ప్రమాదంలో ఒకరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోవడంతో కార్మికులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
మంచు తుఫానుతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో సుమారు 220 విమానాలు రద్దయ్యాయి, ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా సుమారు 90 ఫెర్రీలను ఓడరేవులో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వందలాది హైకింగ్‌ ట్రయల్స్‌ను కూడా మూసివేశారు.

➡️