South Korea : యూన్ అధికారాల నిలిపివేత.. పాలక పార్టీ మద్దతు

సియోల్‌ :   దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌సుక్‌ యేల్‌ రాజ్యాంగ అధికారాల నిలిపివేతకు పాలక కన్జర్వేటివ్‌ పీపుల్‌ పవర్‌ పార్టీ (పిపిపి) చీఫ్‌ హన్‌ డాంగ్‌ హున్‌ శుక్రవారం మద్దతు తెలిపారు. యూన్‌ అధ్యక్ష బాధ్యతలు, అధికారాన్ని వెంటనే నిలిపివేయాల్సి వుందని పార్టీ సమావేశంలో పేర్కొన్నారు. యూన్‌ తిరిగి మార్షల్‌ లాను విధించేందుకు యత్నించడం వంటి విపరీత చర్యలకు దిగే ప్రమాదం ఉందని, ఇది పౌరులను ప్ర మాదంలో పడేస్తుందని అన్నారు.

సైనిక చట్ట అమలు సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఆరోపణల ఆధారంగా కొందరు కీలక నేతలను అరెస్ట్‌ చేసి, నిర్బంధించాల్సిందిగా యూన్‌ దేశ డిఫెన్స్‌ కౌంటర్‌ఇంటెలిజెన్స్‌ కమాండర్‌ (డిసిసి)ని ఆదేశించినట్లు తమకు నిఘా సమాచారం అందిందని హాన్‌ తెలిపారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, దాని ప్రజలను రక్షించడానికి అధ్యక్షుడు యూన్‌సుక్‌ యేల్‌ అధికార బాధ్యతలను తక్షణమే నిలిపివేయడం అత్యవసరమని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మార్షల్‌ లా విధించడం రాజ్యాంగ విరుద్ధం అని గతంలో హాన్‌ వాదించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై చర్చ అనంతరం శనివారం ఓటింగ్‌కు వెళ్లనుంది.

దర్యాప్తు చేపడతాం :  ఉఫ రక్షణ మంత్రి 

మార్షల్‌ లా విధించడంలో మిలటరీ పాత్రపై జడ్జీలతో దర్యాప్తు చేపడతామని ఉప రక్షణ మంత్రి కిమ్‌ సియోన్‌ హో ప్రకటించారు. విచారణలో మిలటరీ ప్రాసిక్యూటర్లు కూడా పాల్గొంటారని  చెప్పారు. యూన్‌, మిలటరీ నేతలు రెండవ సారి మార్షల్‌ లా విధించవచ్చనే మీడియా వార్తలను ఖండించారు. మార్షల్‌ లా అమలు చేయాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ, రక్షణ శాఖ , జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ దానిని కచ్చితంగా అంగీకరించరని కిమ్‌ పేర్కొన్నారు.

కొనసాగుతున్న దేశవ్యాప్త నిరసనలు
బుధవారం నుండి వేలాది మంది నిరసనకారులు సియోల్‌ వీధుల్లో ఆందోళన చేపడుతున్నారు. యూన్‌ వెంటనే రాజీనామా చేయాలని, దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అధ్యక్షుడు రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా సమ్మెకు వెళతామని కొరియన్‌ కార్మిక సంఘాల సమాఖ్య (కెసిటియు) పిలుపునిచ్చింది. డిసెంబర్‌ 11 నుండి నిర వధిక సమ్మెలు చేపడతామని హెచ్చరించింది.

➡️