- యురోపియన్ దేశాలతో సంబంధాలు బలోపేతం
- పారిస్‌లో యరోపియన్ సంస్థల సంఘీభావ సమావేశాలు
బ్రస్సెల్స్ : క్యూబాపై అమెరికా ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని యురోపియన్ మూవ్‌మెంట్స్ డిమాండ్ చేశాయి. క్యూబా లక్ష్యంగా సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాయి. అమెరికా ఆంక్షలతో, పాల్పడుతున్న తప్పుడు ప్రచారంతో నలిగిపోతున్న నేపథ్యంలో క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ నవంబరు 22-24 తేదీల్లో పారిస్‌లో యురోపియన్ దేశాలకు చెందిన సామాజిక ఉద్యమాలు, వాణిజ్య సంఘాలు, రాజకీయ సంస్థలకు చెందిన 300మందికి పైగా ప్రతినిధులు సమావేశమయ్యారు. 19వ యురోపియన్ కాంటినెంటల్ మీటింగ్ ఆఫ్ సాలిడారిటీ విత్ క్యూబా పేరుతో ఈ సమావేశం జరిగింది.
క్యూబా, యురోపియన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా ప్రతినిధులు దృష్టి పెట్టారు. అమెరికా ఆంక్షల వల్ల తలెత్తే ఆర్థిక పర్యవసానాలను పరిష్కరించడంపై, ఈ ఒత్తిళ్లతో రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను చర్చించారు. క్యూబాపై సాగే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు యురోపియన్ నెట్‌వర్క్‌లకు మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తూ ఈ సమావేశం ఒక డిక్లరేషన్‌న ఆమోదించింది. క్యూబా విప్లవానికి బేషరతుగా మద్దతునిస్తూ, మెజారిటీ ప్రజలు ఎంపిక చేసుకున్న సోషలిస్టు ప్రాజెక్టును నిర్మించుకునేందుకు వారికి గల హక్కును ప్రతినిధులు సమర్ధించారు. క్యూబా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ, తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన మీడియా దాడులను వారు తీవ్రంగా నిరసించారు. క్యూబాలో కొత్త సహకార ప్రాజెక్టులను అమలు చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చడం ద్వారా సంఘీభావాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ఇంటర్నేషనల్ పీపుల్స్ అసెంబ్లీకి చెందిన రొడ్రిగొ సునే చెప్పారు. సమావేశాల చివరి రోజు పారిస్‌లో వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్యూబాకు సంఘీభావాన్ని పునరుద్ఘాటించారు. తమ వైఖరిని సమూలంగా మార్చుకోవాల్సిందిగా యురోపియన్ దేశాలను కోరారు.