కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఆపండి

  • ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలన్న లెబనాన్‌ ప్రధాని

బీరుట్‌ : హిజ్బుల్లాతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయిల్‌ తాజాగా వైమానిక దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇటువంటి ఉల్లంఘనలను ఆపేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలని లెబనాన్‌ ప్రధాని నజీబ్‌ మికాతి కోరారు. ఫ్రెంచి అధ్యక్షులు మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ మికాతి ఈ విజ్ఞప్తి చేశారు. బుధవారం తెల్లవారు జాము నుండి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన లెబనాన్‌లో తాజా పరిస్థితుల గురించి వారు మాట్లాడుకున్నారు. ఒప్పందం కుదిరేలా సహకరించినందుకు ఆయన మాక్రాన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి గురువారం జరిగిన దాడిలో గణనీయంగా నష్టం జరిగిందని, పలువురు గాయపడ్డారని మికాతి తెలిపారు. కాగా హిజ్బుల్లానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయిల్‌ ఆర్మీ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో పలు ప్రాంతాల్లోకి వాహనాలు వచ్చాయని తెలిపింది. అందుకే తాము హెచ్చరికగా కాల్పులు జరిపామని వెల్లడించింది. అయితే తైబే గ్రామంపై ఇజ్రాయిల్‌ డ్రోన్‌తో జరిపినదాడిలో నలుగురు గాయపడ్డారని లెబనాన్‌ మిలటరీ తెలిపింది.

➡️