గాజాలో మానవతా సాయం ఆపాం : డబ్ల్యుఎఫ్‌పి వెల్లడి

Jun 11,2024 08:26 #Gaza crisis, #issrel, #wfp

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతునే వున్నాయి. దాడుల్లో గాయపడిన వారితో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. గత 8మాసాలుగా సాగుతున్న దాడులతో ఆస్పత్రులన్నీ బాగా దెబ్బతినడంతో సరైన మౌలిక వసతులు, తగినంత మంది సిబ్బంది కూడా లేకుండా పనిచేయాల్సి వస్తోంది. వెల్లువలా వస్తున్న రోగులకు సరైన చికిత్సనందించలేకపోతున్నామని డాక్టర్లు వాపోతున్నారు. మరోవైపు రఫాలో క్రాసింగ్‌ మూసివేయడంతో మానవతా సాయం అందడం కూడా కష్టమైపోతోంది. భద్రతా కారణాల రీత్యా అమెరికా ఏర్పాటు చేసిన కారిడార్‌ మీదుగా తాము వెళ్లలేమని, అందుకే సహాయం నిలిపివేశామని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రతిపాదన ఆమోదించాల్సిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి వస్తోంది. ఇరుపక్షాల మధ్య మూడంచెల ఒప్పందం కుదిరేలా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఒక కొలిక్కి రావడం లేదు. ఇందుకు సంబంధించిన ముసాయిదా తీర్మానంపై భద్రతా మండలిలో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితిలో అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్‌ వుడ్‌ తెలిపారు. ఇదిలావుండగా శనివారం నుస్రత్‌ శరణార్థ శిబిరంపై జరిగిన దాడిలో 274మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 64మంది పిల్లలే వున్నారని పాలస్తీనా గ్రూపు పేర్కొంది.ఈ దాడిని యుద్ధ నేరంగా పరిగణించాలని డిమాండ్‌చేసింది.

➡️