లేబర్‌ ఎంపిలను సస్పెండ్‌ చేసిన స్టార్మర్‌

లండన్‌ : ఇద్దరు పిల్లల ప్రయోజన పరిమితి రద్దు చేయడానికి ఓటు వేసిన ఎంపిలను బ్రిటన్‌ ప్రధాని  కీర్‌ స్టార్మర్‌ సస్పెండ్‌ చేశారు.  స్టార్మర్‌ నిర్ణయాన్ని యూనియన్‌ నేతలు ఖండించారు. అవమానకరమైన, పూర్తిగా ఖండించదగిన చర్యగా అభివర్ణించారు. ఫైర్‌, ఎడ్యుకేషన్‌, సివిల్‌ సర్వీస్‌, బేకరీస్‌, మెయిల్‌ యూనియన్‌ నేతలు స్టార్మర్‌ నిర్ణయం పూర్తిగా తప్పుడు చర్యగా పేర్కొన్నారు. ఎంపిల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని పిలుపునిచ్చారు.

ఎంపిలు షాడో మాజీ ఛాన్సలర్‌ జాన్‌ మెక్‌డోనెల్‌, షాడో మాజీ బిజినెస్‌ సెక్రటరీ రెబెక్కా లాంగ్‌ బెయిలీ, అప్సానా బేగం, రిచర్డ్‌ బర్గాన్‌, ఇయాన్‌ బైర్న్‌, జరా సుల్తానా, ఇమ్రాన్‌ హుస్సేన్‌లు ఎస్‌ఎన్‌పి సవరణకు మద్దతు ఇచ్చినందుకు లేబర్‌ పార్టీ ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేసింది.

బ్రిటన్‌లో 4.3 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేస్తున్న పిల్లల పేదరికానికి వ్యతిరేకంగా తన వైఖరిని స్పష్టం చేసినందుకు తాను సంతోషిస్తున్నానని కావెంట్రీ సౌత్‌ ఎంపి జరా సుల్తానా పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల ప్రయోజన పరిమితి అనేది ఓస్బోర్న్‌ యుగం నాటి క్రూరమైన విధానాల్లో ఒకటని ఎంపి జాన్‌ మెక్‌డోనాల్‌ పేర్కొన్నారు. ఈ పరిమితి రద్దుకు లేబర్‌ పార్టీకి చెందిన 11 అనుబంధ యూనియన్‌ల మద్దతు ఉందని మరో ఎంపి అప్సానా బేగం తెలిపారు.

ఇద్దరు పిల్లల ప్రయోజన పరిమితిని 2017లో కన్జర్వేటివ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పొదుపు కార్యక్రమంలో భాగంగా 2017 ఏప్రిల్‌  తర్వాత పుట్టిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పరిమితి మూడవ బిడ్డ సంక్షేమం కోసం క్లెయిమ్‌ చేయకుండా తల్లిదండ్రులను నిరోధిస్తుంది.

➡️