ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు
ప్యాంగ్‌యాంగ్ : అణ్వాయుధాల తయారీని బలోపేతం చేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. కిమ్ ఇలాంటి ఆదేశాలను గతంలో అనేకసార్లు చేశారు. అయితే, జపాన్ ప్రధాని ఇషిబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య తాజాగా ద్వైపాక్షిక భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. శనివారం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవంలో కిమ్ పాల్గన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ”న్యూక్లియర్ ఫోర్స్ సహా ప్రత్యర్థులను భయపెట్టే అన్ని రకాల ప్లాన్లను బలోపేతం చేయాలి. అత్యాధునిక అణ్వాయుధాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం” అని కిమ్ తెలిపారు. ఈ సందర్భంగా రష్యాకు తన మద్దతును పునరుద్ఘాటించారు. మాస్కో ప్రజలు, దళాలు వారి దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశికతను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కిమ్ విషయంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా.. మరికొన్నిసార్లు చూసీచూడనట్టు వ్యవహరించారు. 2019లో వియత్నాంలో జరిగిన భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గలేదు. దీంతో నాటి చర్చలు విఫలమయ్యాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. మరోవైపు.. ఇటీవల దక్షిణ కొరియా, జపాన్‌లతో ప్యాంగ్‌యాంగ్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతేడాది ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దక్షిణ కొరియా, అమెరికా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని ప్యాంగ్‌యాంగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమపై దాడికి పాల్పడితే ఎదుర్కోవడానికి అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
