- సురక్షితంగా ఫ్లోరిడా జలాల్లో ల్యాండైన డ్రాగన్ శ్రీ సర్వత్రా హర్షాతిరేకం
కేప్ కేన్వరాల్ : రోదసి చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కేవలం 8 రోజుల పర్యటనకు వెళ్ళి 9నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్‌లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో దీర్ఘకాల నిరీక్షణకు తెర పడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కల్పనా చావ్లా ఉదంతం మదిలో మెదులుతున్న నేపథ్యంలో అందరి మనస్సుల్లో వున్న భయాందోళనలను పటాపంచలు చేస్తూ డ్రాగన్ అంతరిక్ష నౌక సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది. అనుకున్నట్లుగానే అంతా సజావుగా సాగడంతో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు సునీతా విలియమ్స్ బృందం విజయవంతంగా గమ్యం చేరుకుంది. దాంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గంట తర్వాత వ్యోమగాములందరినీ ‘ఫ్రీడమ్’ కాప్య్సూల్ నుండి బయటకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం వారందరినీ వరుసగా స్ట్రెచర్లలో బయటకు తీసుకువస్తుండగా, అందరూ నవ్వుతూ చేతులూపుతూ అభివాదం చేశారు. ‘స్పేస్ ఎక్స్ తరపున మీకు స్వాగతం’ అంటూ కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ రేడియో సందేశం పంపింది. డ్రాగన్ దిగిన వేగానికి చుట్టుపక్కల సముద్ర జలాల్లో పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. అంతరిక్ష నౌక దిగిన వెంటనే పరిస్థితి అంతా సజావుగానే వుందని నిర్ధారించుకున్న తర్వాత రికవరీ నౌకలోకి డ్రాగన్‌ను తరలించారు. ఆ తర్వాత ద్వారం తెరిచి లోపల వున్నవారిని బయటకు తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ సిబ్బంది సహకరించారు. మొదట కమాండర్ హేగ్ రాగా, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునొవ్, మూడో వ్యక్తిగా సునీత, చివరగా విల్మోర్‌లు బయటకు వచ్చారు. వీరిలో కమాండర్ హేగ్, గొర్బునొవ్‌లు సెప్టెంబరు 28న ఐఎస్‌ఎస్‌కు వెళ్ళారు. బయటకు వచ్చిన వెంటనే వారి ఆరోగ్యం ఎలా వుందో చెక్ చేయడానికి వైద్య బృందాలు అక్కడే వేచి వున్నాయి. వీరందరినీ హ్యూస్టన్‌కు తరలించారు. అక్కడ 45రోజుల పాటు వారు రిహాబిలిటేషన్ శిబిరంలో వుంటారు. గురుత్వాకర్షణకు తిరిగి వారి శరీరాలు సర్దుకుపోయేవరకు వారు అక్కడ అనేక రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. దీర్ఘకాలం రోదసిలో గడిపిన వారికి అనేక సమస్యలు ఎదరువుతాయి. ఎముకల సాంద్రత సన్నగిల్లుతుంది, కండరాలు బలహీనమవుతాయి. శరీరంలో పలు అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వాటన్నింటినీ పరీక్షించి, ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు లేకుండా బయటకు రావడంలో ఈ రిహాబిలిటేషన్ ప్రక్రియ బాగా తోడ్పతుంది.
రోదసిలో సుదీర్ఘకాలం వుండిపోవడంతో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై అనేక వార్తలు వెలువడ్డాయి. కానీ వాటన్నింటికీ అమె చెక్ పెడుతూనే వచ్చారు. తాము బాగానే వున్నామని, చక్కగా తింటున్నామని, పని చేసుకుంటు న్నామని చెప్పారు. తమ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. గతేడాది జూన్ 5న సునీతా, విల్మోర్‌లు స్టార్‌లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్ళారు. ఆ తర్వాత ఆ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిద్దరినీ తీసుకురాకుండానే మానవరహితంగా ఆ నౌక తిరిగి వచ్చేసింది. అలా సునీత, విల్మోర్‌లు రోదసిలో చిక్కుకుపోయారు.
4,576 సార్లు భూమిని చుట్టి…
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు రోదసీలో 286 రోజులు గడిపారు. అనుకున్న దానికన్నా వారు అదనంగా 278 రోజులు అక్కడే చిక్కుకుపోయారు. ఈ కాలంలో వారు 4,576సార్లు భూమిని చుట్టివచ్చారు. 121 మిలియన్ మైళ్ళు (19.5 కోట్ల కిలోమీటర్లు) ప్రయాణించారు. అతిథులుగా వెళ్ళిన వీరిద్దరు పరిస్థితులు ఒక్కసారిగా మారడంతో వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిగా మారి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు ప్రయోగాలు నిర్వహించారు. పరికరాలను అమర్చారు. ఇద్దరూ కలిసి రోదసిలో నడిచారు. 9సార్లు జరిపిన స్పేస్ వాక్‌లో మొత్తంగా 62గంటలు నడిచారు. మహిళా వ్యోమగాముల్లో అత్యధిక సమయం రోదసిలో నడిచిన మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు.
ఈ పుడమి స్వాగతిస్తోంది
సునీతా బృందానికి ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ‘ఈ పుడమి మిమ్మల్ని స్వాగతిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. హద్దుల్లేని మానవ స్ఫూర్తికి, ధైర్యసాహసాలకు వారొక ప్రతీక, పట్టుదల అంటే ఏమిటో, ఎలా వుంటుందో వారు చూపించారని అన్నా రు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టా రు. వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి కృషి చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. రోదసీ అన్వేషణలో సునీతా విలియమ్స్ అనుభవాలను, నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ఇస్రో అకాంక్షిస్తోందని ఇస్రో చీఫ్ డాక్టర్ వి.నారాయణన్ వ్యాఖ్యానించారు. సురక్షితంగా తిరిగి వచ్చిన సునీత బృందానికి అభినందనలు తెలియచేశారు.