రగులుతున్న సిరియా !

  • 830మంది సామాన్యులుసహా 1300 మంది మృతి
  • అసద్‌ అనుచరులు, ప్రభుత్వ బలగాల మధ్య కొనసాగుతున్న దాడులు

డమాస్కస్‌ : పాశ్చాత్స్య దేశాల మద్దతుతో పాలన సాగిస్తున్న హైయత్‌ తహ్రీర్‌ అల్‌షమ్‌ (హెచ్‌టిఎస్‌) అనుబంధంగా ఉన్న సాయుధ గ్రూపులు ఐదు రోజులుగా సిరియాలో సాగిస్తున్న దారుణ హింసాకాండలో 1300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శుక్ర, శని, ఆదివారాల్లో పశ్చిమ తీరంలో మైనారిటీలైన అలవైట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, 830మందికి పైగా పౌరులు బలయ్యారని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ (ఎస్‌ఒహెచ్‌ఆర్‌) తెలిపింది. 231 మంది సిరియా భద్రతా దళాలకు చెందినవారు, 250 మంది అసద్‌ మద్దతుదారులు కూడా చనిపోయారని పేర్కొంది. మృతుల్లో అత్యధికులు సిరియాను గత ఐదు దశాబ్దాలుగా పాలించిన మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ అలవైట్‌ వర్గానికి చెందినవారే, అసద్‌ పాలనలో మతపరంగా మైనారిటీలైన వీరి ఆధిపత్యం ఉండేది. అసద్‌ పదవీచ్యుతుడైన తర్వాత వారిపై మూకుమ్మడిగా దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలో తీవ్ర స్థాయిలో అంతర్యుద్ధం నెలకొంది. అసద్‌ మద్దతుదారులని తెలిస్తే చాలు ఎక్కడబడితే అక్కడే వారిని ఊచకోత కోస్తున్నారు. దీంతో వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయని మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ తెలిపింది. అసద్‌ విశ్వాసపాత్రులను ఏరిపారేస్తామని, వారు విదేశీ శక్తుల తోడ్పాటుతో ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సిరియా కొత్త నేత అహ్మద్‌ అల్‌ షరారా అన్నారు. షరారాకి చెందిన రెబెల్‌ గ్రూపు హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌టిఎస్‌) గత డిసెంబరులో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది.

అసద్‌ మద్దతుదారులపై దారుణ హింస

అసద్‌ మద్దతుదారులను హెచ్‌టిఎస్‌ ప్రభుత్వం తీవ్రమైన హింసకు గురిచేస్తోంది. అల్‌ అన్‌ టివి మధ్య ఆసియా కరస్పాండెంట్‌ జెనాన్‌ మౌసా ఈ మేరకు ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అందులో పాత పాలన అవశేషాలుగా పేర్కొంటూ తీవ్రమైన హింసకు గురిచేయడం కనిపించింది. అల్‌ మొఖ్తరియే ప్రాంతంలో 29 మందిని, అల్‌ హఫా ప్రాంతంలో 11 మందిని ఉరితీసినట్లు మౌసా పేర్కొన్నారు. అసద్‌కు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండటం కాదని, అలవైట్లను తరిమివేయడానికి ఉద్దేశించిన మతపరమైన మారణహోమమని, 14 ఏళ్ల అంతర్యుద్ధంలో అత్యంత దారుణమైన హింస అని అసద్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఎస్‌ఒహెచ్‌ఆర్‌ సంస్థ డైరెక్టర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ పేర్కొనడం గమనార్హం. పలువురు మహిళలు, పిల్లలు, వృద్ధులు లటాకియా హ్మెయిమిమ్‌లోని రష్యన్‌ సైనిక స్థావరంలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. మహిళలు, పిల్లలతోసహా అలవైట్లను ఉరితీశారని, వారి ఇళ్లను ఆస్తులను దోచుకున్నారని ఆయన చెప్పారు. హత్యలు, దోపిడీలు, గృహదహనాలు కొనసాగాయని పేర్కొన్నారు.
అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న హెటిఎస్‌ అనుబంధ సమూహాలు ౖ’అలవైట్లను చంపడం తప్పనిసరి’ అని మసీదులలో పిలుపునిచ్చాయని సోషల్‌ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తున్నాయి. దేవుని శత్రువులుగా అభివర్ణిస్తూ అలవైట్లపై మారణహోమానికి పాల్పడుతున్నారని స్వతంత్ర పరిశోధనా సంస్థ సెంచరీ ఇంటర్నేషనల్‌ నుంచి అరోన్‌ లండ్‌ తెలిపారు.

➡️