దుబాయ్ : సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా ఆదివారం తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా వెళ్లారు. సిరియా అధ్యక్షుడు, తన ప్రభుత్వ విదేశాంగ మంత్రి అసద్ అల్ -షైబానీతో కలిసి రియాద్ చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులు సౌదీ జెట్‌లో ప్రయాణించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశం కానున్నారు. సిరియా ప్రధాన మిత్రదేశంగా ఉన్న ఇరాన్ నుండి వైదొలగడానికి సంకేతంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల డమాస్కస్‌లో తిరుగుబాటు గ్రూపుల మధ్య జరిగిన సమావేశంలో సిరియా తాత్కాలిక అధ్యక్షునిగా అహ్మద్ అల్ షరాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తిరుగుబాటు గ్రూపు హయత్ తహ్రీర్ అల్ షామ్ అధ్యక్షుడిగా షరా పనిచేస్తున్నారు. ఈ గ్రూపు గతంలో అల్‌ఖైదాకు అనుబంధ గ్రూపుగా ఉండేది. ప్రస్తుతం తమకు అల్‌ఖైదాతో సంబంధాలు లేవని షరా చెబుతున్నారు. షరాపై అమెరికా గతంలో 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. గత నెలలో అమెరికా ప్రతనిధి బఅందం సిరియాలో పర్యటించిన తరువాత ఆ బహుమతిని రద్దు చేసింది. గత ఏడాదిలో తిరుబాటు దళాలు దాడి చేయడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయింది. అసద్ ప్రస్తుతం రష్యా ఆశ్రయంలో ఉన్నారు.