కుర్దీష్‌ అధికారులతో సిరియా తాత్కాలిక ప్రభుత్వం ఒప్పందం..

డమాస్కస్‌ : సిరియా  ఈశాన్య ప్రాంతాన్ని నియంత్రించే కుర్దీష్‌ నేతృత్వంలోని అధికారులతో  ఆ దేశ  తాత్కాలిక ప్రభుత్వం సోమవారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కాల్పుల విరమణతో పాటు ఆ ప్రాంతంలో అమెరికా మద్దతు గల దళాలను సిరియన్‌ ఆర్మీలో విలీనం చేయడం వంటివి ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఒప్పందంతో   రెబల్‌ గ్రూప్‌ హయత్‌ తహ్రీర్‌ అల్‌ -షామ్‌ (హెచ్‌టిఎస్‌) నేతృత్వంలోని అహ్మద్‌ అలా షరారా ప్రభుత్వం చేతుల్లోకి సిరియాలోని అత్యధిక భూభాగం వెళ్లనుంది. ఈ ఒప్పందంపై అహ్మద్‌ అల్‌-షరారా, అమెరికా మద్దతుగల కుర్దీష్‌ నేతృత్వంలోని సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ మజ్లౌమ్‌ అబ్దిలు సంతకాలు చేశారు. హెచ్‌టిఎస్‌ డిసెంబర్‌లో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయనున్న ఈ ఒప్పందం ద్వారా ఇరాక్‌, టర్కీతో పాటు అన్ని సరిహద్దులు, ఈశాన్య ప్రాంతంలోని విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు షరారా నియంత్రణలోకి వెళ్లనున్నాయి. రెబల్‌ గ్రూప్‌కి చెందిన సుమారు 9,000 మంది అనుమానిత సభ్యులు ఉన్న జైళ్లు కూడా షరారా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.

అసద్‌ మద్దతుదారులు, మైనారిటీలైన అలవైట్లు లక్ష్యంగా హెచ్‌టిఎస్‌ సాయుధ దళాలు దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా సాగిస్తున్న దారుణ హింసకాండలో 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  మృతుల్లో అత్యధికులు సిరియాను గత ఐదుదశాబ్దాలుగా పాలించిన మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మద్దతుదారులే. అసద్‌ మద్దతుదారులని తెలిస్తే చాలు  ఊచకోతకోస్తుండటంతో వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయని మానవహక్కుల పర్యవేక్షక  సంస్థ తెలిపింది. ఈ ఒప్పందం వారిపై మరో వేటు కానుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

➡️