Mexico : భద్రతా బలగాల దాడిలో పది మంది దుండగులు మృతి

మెక్సికో సిటీ : మెక్సికోలో సోమవారం భద్రతాదళాలు సాయుధ దుండగులపై ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో 10 మంది సాయుధ దుండగులు మరణించగా, ముగ్గురు పోలీసులు గాయపడినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్‌కు నిలయంగా మారిన గ్వానాజువాటోలోని యురిరియా మునిసిపాలిటీలో పోలీసులు, మిలటరీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. తొలుత ఎనిమిది మంది మరణించినట్లు గ్వానాజువాటో రాష్ట్ర భద్రతా విభాగం ప్రకటించింది. అయితే తుపాకీ గాయాలతో మరో రెండు మృతదేహాలను గుర్తించామని పేర్కొంది. దొంగతనానికి గురైన పలు వాహనాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ చొక్కాలు, డజనుకి పైగా ఆయుధానలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మెక్సికోలో  గ్వానాజువాటాలో  స్థానిక శాంటా రోసాడి లిమా గ్యాంగ్‌, లాటిన్‌ అమెరికాకు చెందిన జాలిస్కో న్యూజనరేషన్‌ డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణలు తరచుగా  జరుగుతుంటాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. 2006లో డ్రగ్స్‌ అక్రమ రవాణాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సైన్యాన్ని మోహరించినప్పటి నుండి మెక్సికోలో హింసాత్మక ఘటనల్లో 4,50,000 మందికి పైగా మరణించారు.

➡️