- ట్రంప్ డిక్రీ జారీ
- ఇదో రాజకీయ జిమ్మిక్కు అన్న నిపుణులు
- ఉత్తర్వు చెల్లుబాటును సవాల్ చేసిన 22 రాష్ట్రాలు
వాషింగ్టన్: పత్రాలు లేని వలసదారులు, తాత్కాలిక వీసాహోల్డర్లకు జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ఈ చర్య తీసుకున్నారు. జన్మత్ణ పౌరసత్వం కల్పించేందుకు సంబంధించి నూట ఏబై ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పద్నాలుగో సవరణకు భిన్నంగా ఉన్న ట్రంప్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే 22 రాష్ట్రాలు కోర్టుల్లో దావా వేశాయి. తక్షణమే ఈ చర్యను రద్దు చేయాలని అవి డిమాండ్ చేశాయి. 2025 ఫిబ్రవరి 19 తర్వాత జన్మించిన పిల్లల పౌరసత్వాన్ని నిలిపివేయాలని ఫెడరల్ ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు. దీని వల్ల ఏటా దేశ వ్యాపితంగా 1,53,000 మంది, ఒక్క కాలిఫోర్నియాలోనే 24 వేల మంది దాకా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం గా మారనుంది. .పత్రాలు లేని, తాత్కాలిక వీసాపై ఉన్న కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లల జన్మహక్కును ఇది తొలగిస్తుంది. ట్రంప్ ఎన్నికల వాగ్దానాల తర్వాత గ్రీన్ కార్డు సంస్కరణల కోసం ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లను ఇది శరాఘాతమే. 1868లో ఆమోదించబడిన 14వ సవరణ” అమెరికాలో జన్మించిన లేదా సహజ సిద్ధమైన వ్యక్తులందరూ దాని అధికార పరిధికి లోబడి అమెరికా పౌరులు అవుతారు” అని స్పష్టంగా పేర్కొంది. మాజీ బానిసలకు పౌరసత్వం , చట్ట ప్రకారం సమాన రక్షణ కల్పించేలా ఈ నిబంధన రూపొందించబడింది. ట్రంప్ చర్య ఇప్పటికే అమలులో ఉన్న సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించేదిగా ఉంది. ట్రంప్ చర్యపై ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్.ఖన్నా స్పందిస్తూ, దీని వల్ల అక్రమ వలసదారులే కాకుండా హెచ్-1బి వీసా వంటి చట్టబద్ధమైన పత్రాలతో వచ్చి ఇక్కడ వుంటున్న వారు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్ వీసా, హెచ్1బి లేదా హెచ్2బి వీసా లేదా బిజినెస్ వీసాలపై వచ్చి తాత్కాలికంగా వుండే చట్టబద్ధమైన ఇమ్మిగ్రెంట్లకు కూడా తిప్పలు తప్పవని అన్నారు. ట్రంప్ ఏం చేసినా దానితో నిమిత్తం లేకుండా జన్మత: పౌరసత్వం అనేది ఈ దేశ చట్టంగా వుండాలి, దాని కోసం పోరాడతామని మరో కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్ వ్యాఖ్యానించారు. ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రమీలా జయపాల్ అభివర్ణించారు. ఒక్క కలం పోటుతో పౌరసత్వాన్ని లాగేసుకోలేరని అన్నారు. దీన్ని గనక చట్టబద్ధం చేసినట్లైతే మన దేశ చట్టాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన సంప్రదాయాలను అపహాస్యం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఎదురవకపోతే, 30రోజుల్లోగా ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
22 రాష్ట్రాల దావా
ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ డెమొక్రటిక్ పార్టీ పాలనలో వున్న 22 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ రెండు ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో మంగళవారం దావా వేశారు. తక్షణమే ఆ ఆదేశాలను నిలుపు చేయాలని కోరారు. 18 రాష్ట్రాలు, రెండు నగరాలైన శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ మసాచుసెట్స్‌లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులోవ్యాజ్యం దాఖలు చేయగా, మరోనాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్‌లో రెండో వ్యాజ్యాన్ని వేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణ కింద జన్మత: పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా వస్తుందని, అధ్యక్షుడు గానీ కాంగ్రెస్ గానీ దాన్ని సవరించలేరని పిటిషనర్లు వాదించారు. తక్షణమే దీన్ని నిలుపుచేస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరారు.