అంధకారంలో అమెరికా ప్రజానీకం

  • మంచు తుపాను కమ్మేయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
  • పలు రాష్ట్రాల్లో ఎమర్జన్సీ

వాషింగ్టన్‌ : అమెరికాలో లక్షలాది మంది ప్రజానీకం అంధకారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతిపెద్ద మంచు తుపాను సెంట్రల్‌, తూర్పు అమెరికాను కమ్మేయడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యంత శీతల గాలులు, భారీగా కురుస్తున్న హిమపాతంతో ప్రజలు వణికిపోతున్నారు. మంచు తుపాను సంబంధిత కారణాలతో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాడు 2300కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మిస్సౌరి నుండి వర్జీనియా వరకు దాదాపు రెండు లక్షలమంది ప్రజలు విద్యుత్‌ లేకుండా చీకట్లో మగ్గుతున్నారు.
ఈ సంవత్సరంలో మొట్టమొదటిదైన ఈ మంచు తుపాను మంగళవారం రాత్రికి తూర్పు దిశగా పశ్చిమ అట్లాంటిక్‌ ప్రాంతంలోకి పయనించనుంది. ఈ తుపాను ఉధృతి తగ్గినా మరికొన్ని రోజుల పాటు గడ్డ కట్టించే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని భావిస్తున్నారు. కన్నాస్‌ సిటీ వంటి కొన్ని నగరాల్లో మైనస్‌ల్లోకి ఉష్ణోగ్రతలు వెళ్లిపోయాయి. అమెరికా గల్ఫ్‌ తీర ప్రాంతంలో ఈ సీజనులోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కాగా బాధిత ప్రాంతాలకు తక్షణమే సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోందని వైట్‌హౌస్‌ ప్రతినిధి చెప్పారు. మంచు తుపాను కారణంగా వాషింగ్టన్‌లో కార్యాలయాలు, స్కూళ్ళు మూతపడ్డాయి. కెంటకీ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో మంచు కురుస్తుండడంతో హైవేలన్నీ మంచు దిబ్బలుగా మారిపోయాయి. సరస్సులన్నీ గడ్డ కట్టేసి మంచు మైదానాలుగా మారిపోయాయి. కెంటకీ, మిస్సౌరి, వర్జీనియా, మేరీల్యాండ్‌, టెక్సాస్‌ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులను ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి వెళ్ళవద్దని ప్రజలను కోరారు. వాతావరణ మార్పుల వల్ల ఇటువంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు రాన్రాను సర్వసాధారణమై పోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

➡️