గాజాలో అరబ్‌ ప్రణాళికనే అమలు చేయాలి

Mar 9,2025 10:00 #Arab plan, #Gaza, #implemented
  • సమర్ధించిన ఓఐసి
  • రంజాన్‌ మాసంలో మసీదులపై దాడికి దిగిన ఇజ్రాయిల్‌

గాజా : గాజాలోకి మానవతాసాయం ప్రవేశించనివ్వకుండా గత వారం రోజులుగా ఇజ్రాయిల్‌ అమలు చేస్తున్న ఆంక్షలను తక్షణమే విరమించాలని పలు దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను ఇజ్రాయిల్‌ పెడచెవిన పెడుతోంది. గాజాపై మరిన్ని దాడులకు కూడా దిగుతోంది. తాజాగా ఈ దాడుల్లో రాఫాలో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని ఉత్తర ప్రాంతంలోని నబ్లస్‌ నగరంలో గల పలు మసీదులపై శుక్రవారం ఇజ్రాయిల్‌ దాడులకు దిగింది. పురాతనమైన అల్‌ నాసర్‌ మసీదులోకి చొరబడిన సైనికులు ఇమామ్‌ గదికి నిప్పంటించారు. అగ్నిమాపక దళాన్ని కూడా లోపలకు ప్రవేశించనీయలేదని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ఆహారం, నిత్యావసరాలు, శిబిరాలు, మొబైల్‌ ఇళ్లు వంటి సాయంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి నాలుగు రోజుల గడువును ఇస్తున్నామని, లేనిపక్షంలో ఇజ్రాయిల్‌పై నావికాదళ దాడులు మొదలవుతాయని హౌతి రెబెల్స్‌ హెచ్చరించారు.

ట్రంప్‌ ప్రణాళికను వ్యతిరేకిస్తున్నాం : ఓఐసి

గాజాను మొత్తంగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మాణం చేస్తామని ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈజిప్ట్‌ నేతృత్వంలోని అరబ్‌ దేశాలు చేసిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ఇస్లామిక్‌ సహకార సమాఖ్య (ఓఐసి) సమర్ధించింది. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం ముగిసిన తర్వాత స్వతంత్ర పాలనాపరమైన కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్ట్‌ ప్రతిపాదించింది. వృత్తిపరమైన నిపుణులతో కూడిన ఈ కమిటీకి గాజా పాలనా బాధ్యతలు అప్పగించాలని సూచించింది. మొదటి దశ ఆరు మాసాల పాటు వుంటుందని, తర్వాత రెండు దశలు కలిసి నాలుగు నుండి ఐదేళ్లు వుంటాయని తెలిపింది. రహదారులపై శిధిలాలను తొలగించిన తర్వాత, 2లక్షల తాత్కాలిక ఇళ్లను నిర్మించి, ప్రజలకు అప్పగించాలి. దెబ్బతిన్న 60వేల భవనాలను పునరుద్ధరించాలన్నది ఆ ప్రణాళికలో భాగంగా వుంది. నెమ్మదిగా నీరు, వ్యర్థాల వ్యవస్థలను ఏర్పాటు చేయడం, టెలికమ్యూనికేషన్‌, విద్యుత్‌ సేవలను పునరుద్ధరించాలని సూచిస్తోంది.

దాడుల్లో 12.298 మంది మహిళలు మృతి

గాజాపై ఇజ్రాయిల్‌ 519రోజులుగా సాగించిన దాడుల్లో 12,298మందికి పైగా మహిళలు మరణించారని పాలస్తీనా అథారిటీ తెలిపింది. వేలాదిమంది మహిళలు ఇళ్లూ వాకిళ్ళు వదిలేసి, పిల్లా పాపలతో నిర్వాసితులయ్యారని వెల్లడించింది. మనుగడ కోసం పోరాటం సాగించే వారిలో పాలస్తీనా మహిళలు అగ్ర భాగాన వుంటారని పిఎ వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. హింస, వేధింపులు భరిస్తూ 21మంది మహిళలు ఇజ్రాయిల్‌ జైళ్లలో మగ్గిపోతున్నారని తెలిపింది.
గాజాలో రెండో దశ కాల్పుల విరమణ చర్చలపై సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని హమాస్‌ వ్యాఖ్యానించింది. హమాస్‌ ప్రతినిధి బృందం కైరోలోని మధ్యవర్తులను కలిసిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదలైంది.

➡️