జెరూసలెం : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గాజాలో కాల్పుల విరమణ ఎట్టకేలకు ఆరంభమైంది. హమాస్ మొదటి రోజున ముగ్గురు మహిళా బందీలను విడుదల చేసింది. విడుదలజేసే బందీల జాబితా హమాస్ ప్రకటించే వరకు పోరు కొనసాగుతుందని ఇజ్రాయిల్ హూంకరించింది. జాబితా విడుదలలో జాప్యం కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా అమలులోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం .. ఆదివారం ఉదయం 11.45 గంటలకు గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
చివరి నిమిషం దాకా దాడులు
ఇజ్రాయిల్ కిరాతకానికి 13 మంది బలి
ఒప్పందం ఖరారైన చివరి నిమిషం వరకు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై దాడులు చేస్తూనే ఉందని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం .. ఉదయం 8.30 గంటల నుండి ఇజ్రాయిల్ వైమానిక, ఫిరంగి దాడులు జరపడంతో 13 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా వైద్యులు తెలిపారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఆదేశాల మేరకే గాజా ప్రాంతంలో దాడి కొనసాగిస్తున్నట్లు సైన్యం పేర్కొంది.
ఒప్పందం ప్రారంభం కావడానికి గంట ముందు విడుదల చేసిన ఓ ప్రకటనలో .. హమాస్ విడుదల చేయవలసిన బందీల జాబితాను ఇజ్రాయిల్ స్వీకరించే వరకు కాల్పుల విరమణ ఉండదని ప్రధాని సైన్యానికి తెలిపినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.