నదిలో కుప్పకూలిన హెలికాప్టర్‌ – కుటుంబంతో సహా దిగ్గజ టెక్‌ సంస్థ సీఈఓ మృతి

న్యూయార్క్‌ : అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లో ఓ పర్యాటక హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కుప్పకూలడంతో టెక్‌ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం … ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌ కంపెనీ స్పెయిన్‌ విభాగ అధిపతి, సీఈఓ అగస్టన్‌ ఎస్కోబార్‌ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హడ్సన్‌ నది మీదుగా వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. దీంతో విమానం గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఎస్కోబార్‌, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు పైలట్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బెల్‌ 206 చాపర్‌ను న్యూయార్క్‌ హెలికాప్టర్‌ టూర్స్‌ విభాగం సైట్‌ సీయింగ్‌ కోసం వినియోగిస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని తెలిపారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

➡️