దిగుమతి సుంకాలు విధించిన ట్రంప్‌ .. ధీటుగా స్పందించిన ఆయా దేశాలు

వాషింగ్టన్‌ :   అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. చైనా, కెనడా, మెక్సికన్‌ దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కెనడా, మెక్సికన్‌ దిగుమతులపై 25 శాతం చొప్పున , చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్‌లు విధించారు. సుంకాలను విధిస్తూ మూడు వేర్వేరు అధికారిక ఉత్తర్వులపై సంతకం చేస్తూ.. ఆయా దేశాల నుండి అక్రమ వలసదారులు, డ్రగ్స్‌ ముప్పు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మంగళవారం నుండి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి.

”అమెరికన్లకు భద్రత కల్పించాల్సి వుంది.వారికి భద్రత కల్పించడం అధ్యక్షునిగా నా బాధ్యత. సరిహద్దుల ద్వారా అమెరికాలోకి చొరబడుతున్న అక్రమవలసదారులను, మాదకద్రవ్యాలను అడ్డుకుంటానని ప్రచారం సమయంలో ప్రజలకు నేను వాగ్దానం చేశాను. ఆ హామీకి అనుకూలంగా ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపించారు ” అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

ధీటుగా స్పందించిన  చైనా,  కెనడా, మెక్సికో

ఈ దిగుమతి సుంకాలపై ఆయా దేశాలు ధీటుగా స్పందించాయి.  ట్రంప్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు   చైనా పేర్కొంది.  తగిన పరిణామాలను ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించింది.

అమెరికా విధించిన సుంకాలను ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని ట్రంప్‌ ఉత్తర్వులకు ప్రతిస్పందనగా కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో పేర్కొన్నారు. 155 బిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన అమెరికన్‌ వస్తువులపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు.
సుంకాలు విధించడంతో సమస్య పరిష్కారం కాదని మెక్సికన్‌ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ పేర్కొన్నారు. చర్చలు, దౌత్యపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మెక్సికో ప్రయోజనాల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని, ప్లాన్‌ బిని అమలు చేయాల్సిందిగా ఆర్థిక కార్యదర్శిని ఆదేశించానని సోషల్‌మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు.

➡️