బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం సంభవించింది. శనివారం ఒక బంగారు గని కుప్పకూలడవంతో 48 మంది కార్మికులు మరణించారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఆదివారం కూడా ప్రమాద ప్రాంతం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పేద దేశమైన మాలి ప్రపంచంలో ప్రముఖ బంగారు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ముడి బంగారాన్ని వెలికి తీసి ఇతర దేశాలకు తరలిస్తుంటారు. అయితే ఇక్కడ గనులను అక్రమంగానూ లేదా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే మాలి బంగారు గనుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. శనివారం జరిగిన ప్రమాదం నెల రోజుల వ్యవధిలోనే రెండోది. శనివారం కొండచరియలు విరిగిపడ్డంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కొంత మంది కార్మికులు నీటిలో కొట్టుకుపోయారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
