ఇయు పార్లమెంట్‌లో అతిపెద్ద శక్తిగా ఇపిపి గ్రూపు

Jun 11,2024 08:07 #epp group, #largest force, #Parliament
  • బ్రస్సెల్స్‌ కింగ్‌ మేకర్‌ మెలోని
  • మాక్రాన్‌పై ఫ్రెంచ్‌ మితవాద పార్టీ పైచేయి

బ్రస్సెల్స్‌ : యురోపియన్‌ పార్లమెంట్‌లోని 720మంది సభ్యులను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికల్లో లక్షలాదిమంది యురోపియన్లు ఓటు వేశారు. ఇంకా తుది ఫలితాలు రావాల్సివున్న నేపథ్యంలో 27 దేశాల వ్యాప్తంగా ఎవరు విజేతలు, పరాజితులో స్పష్టమవుతోంది. ఫ్రాన్స్‌ మితవాద పార్టీ నేషనల్‌ ర్యాలీ గెలిచేందుకు సిద్ధమైందని మొదటి ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైన నేపథ్యంలోనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ను రద్దు చేశారు. మరోపక్క ఇటలీ నేత జార్జియా మెలొని కీలకమైన బ్రస్సెల్స్‌ కింగ్‌ మేకర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఆమెకు 28శాతం ఓట్లు లభించాయి. మితవాద ఇపిపి గ్రూపు పార్లమెంట్‌లో అతిపెద్ద గ్రూపుగా అవతరించింది. 2019తో పోలిస్తే 13సీట్లు అదనంగా గెలుచుకున్నారు. ఇక పరాజితుల్లో ఆస్ట్రియా, జర్మనీలోని గ్రీన్స్‌, వున్నారు. అనుకున్న దానికన్నా వారికి అధ్వానమైన ఫలితాలు వచ్చాయి. 2019తో పోలిస్తే లిబరల్‌ రెన్యూ గ్రూపు 20సీట్లు కోల్పోయింది. జర్మనీలోని సోషల్‌ డెమోక్రాట్స్‌లో ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షుల్జ్‌ పార్టీ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. యురోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తొలి అంచనాలను పరిశీలించినట్లైతే గ్రీన్‌, లిబరల్‌ రెన్యూ పార్టీలు ఒక్కోటి దాదాపుగా 20 స్థానాల వరకు కోల్పోయే అవకాశం వుందని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆదివారం ఆర్ధరాత్రి విడుదల చేసిన అంచనాల ప్రకారం గ్రీన్‌పార్టీ 72 నుండి 53 స్థానాలకు దిగిపోయింది. మాక్రాన్‌ నేతృత్వంలోని రెన్యూ పార్టీ 102 స్థానాల నుండి 83కి పడిపోయింది. ఈ కారణంగానే మాక్రాన్‌ మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు.

➡️