- లెబనాన్‌లో కాల్పుల విరమణపై యుఎన్ చీఫ్ వ్యాఖ్యలు
లిస్బన్ : తాజాగా ఇజ్రాయిల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాను ముసురుకొన్న సంక్షోభం నేపథ్యంలో తొలి ఆశా కిరణమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలోని ఇరు పక్షాలు కూడా కాల్పుల విరమణ పట్ల నిబద్ధతను పాటిస్తూ, ఒప్పందాన్ని గౌరవించడం చాలా కీలకమని పేర్కొన్నారు. తన స్వస్థలమైన లిస్బన్‌కు వచ్చిన ఆయన టెలివిజన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఎలా అమలవుతోందన్న అంశంపై లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షక బలగాలు పర్యవేక్షించడానికి సిద్ధంగా వున్నాయన్నారు. గాజాలో కూడా తక్షణమే కాల్పుల విరమణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. నెలల తరబడి అలుముకున్న అంథకారంలో తొలి ఆశా కిరణంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగిందని, ఇది శుభ సూచకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలకు అపారమైన మూల్యాన్ని చెల్లించిన సామాన్య పౌరులకు ఇది చాలా కీలకమని పేర్కొన్నారు.