వ్యవసాయరంగం ద్వారాలు తెరవాలి

  • అమెరికన్‌ నట్స్‌, పళ్లు, కోళ్లు వాణిజ్యానికి అవకాశమివ్వాలి
  • ఇండియా టుడే సదస్సులో అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : విదేశీ వాణిజ్యానికి భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలని అమెరికా కోరింది. ఆ రంగంలోకి బయటివారు ప్రవేశించకుండా ద్వారాలు మూసుకుని కూర్చుంటే సరిపోదని వ్యాఖ్యానించింది. దేశీయంగా అనేక సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని కారణాలుగా చూపుతూ ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని విదేశీ వాణిజ్యానికి అనుమతించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్‌ లుత్నిక్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్‌ నట్స్‌, పళ్లు, కోళ్లకు భారత మార్కెట్‌ ద్వారాలు తెరవాలని అమెరికా చాలా కాలంగా పట్టుబడుతున్నా, భారత ప్రభుత్వం వినడం లేదని అన్నారు. ”అలా కాకుండా భారత వ్యవసాయ మార్కెట్‌ తలుపులు బార్లా తెరవాలి, అది మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం, కోటాలు పెట్టుకోవచ్చు, పరిమితులు విధించుకోవచ్చు. కానీ మీకు అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి చర్చలకు ఆవలి వైపు వున్నప్పుడు మీరు మరింత తెలివిగా ఆలోచించాలి.” అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని, ప్రపంచంలోనే అతిపెద్ద వినిమయ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంతో ఒప్పందం లాభదాయకంగా వుంటుందని చెప్పుకున్నారు.
ఇండియా టుడే సదస్సులో ఆయన మాట్లాడుతూ అమెరికా పట్ల భారత్‌ తన టారిఫ్‌ విధానాన్ని తగ్గించుకుంటే అసాధారణమైన అవకాశాలను, అద్భుతమైన సంబంధాలను తమదేశం అందిస్తుందని చెప్పారు. ట్రంప్‌ రెండో హయాంలో వాణిజ్యం, టారిఫ్‌లపై ప్రధానంగా దృష్టి పెడుతున్న తరుణంలో విస్తృతమైన భారత్‌-అమెరికా సంబంధాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, పరస్పరం వాణిజ్యం చేసేటప్పుడు ప్రభుత్వాలు ఆలోచించే అంశాలు చాలా వుంటాయని అన్నారు. భారత్‌ చారిత్రకంగా తన మిలటరీ సామాగ్రిని ఎక్కువగా రష్యా నుండి కొనుగోలు చేస్తుందని, దాన్ని కొంతమేరకు ఆపాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. బ్రిక్స్‌లో భారత్‌ భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, ఉమ్మడి కరెన్సీని చైనా ప్రతిపాదించడం తమకు నచ్చడం లేదన్నారు. డాలర్‌ ప్రాముఖ్యతను తగ్గించే యత్నంగా తాము చూస్తున్నామన్నారు. భారత్‌లో తమకు నచ్చని అంశాలు కొన్ని వున్నాయని, అలాంటివి ఆగిపోవాలని తాము కోరుకుంటామని చెప్పారు. భారత్‌తో విశ్వసనీయమైన, బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్నది అమెరికా అభిమతమని ఆయన స్పష్టం చేశారు.

➡️