ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ అంతర్గత నిఘా విభాగం షిన్‌బెట్ అధిపతి రొనెన్ బార్ పై శుక్రవారం ప్రధాని నెతన్యాహు వేటు వేశారు. ఆయనపై తమకు విశ్వాసం సన్నగిల్లిందని పేర్కొన్నారు. నెతన్యాహు నిర్ణయాన్ని ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆయన వారసుడిని నియమించిన తర్వాత కాని, ఏప్రిల్ 10న గానీ అతను పదవి నుంచి వైదొలగుతారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
షిన్‌బెట్ అధిపతిపై నమ్మకం లేదు : నెతన్యాహు
తనకు షిన్‌బెట్ అధిపతిపై నమ్మకం లేదని ఆదివారమే ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బార్ పదవీకాలం వాస్తవానికి వచ్చే సంవత్సరం ముగియనుంది. ఆయన 2021లో ఈ బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరి మధ్య మొదటినుంచి సత్సంబంధాలు లేవు. ఇక ఇజ్రాయెల్ పై హమాస్ దాడి అనంతరం అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్చి 4వ తేదీన హమాస్ దాడిపై షిన్‌బెట్ అంతర్గత నివేదిక విడుదలయ్యాక అవి పూర్తిగా పతనం అయ్యాయి. ఆ నివేదికలో ఏజెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వెల్లడైంది. అదే సమయంలో ప్రభుత్వ విధానాలు కూడా హమాస్ సైనికపరంగా బలోపేతం కావడానికి ఉపయోగపడ్డాయని పేర్కొంది.
ప్రతిపక్షాల ఆందోళనలు…
బార్‌పై వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. నెతన్యాహు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారని ఆరోపించాయి. జెరూసలెంలో ప్రధాని నివాసం, పార్లమెంట్ వద్ద భారీ స్థాయిలో ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. అదే సమయంలో మంత్రుల సమావేశం జరుగుతుండటం విశేషం.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ చర్యలు : బార్
ప్రభుత్వ నిర్ణయంపై బార్ స్పందిస్తూ ”నెతన్యాహు తనపై చర్యల వెనక ఉద్దేశాలను దాచిపెడుతూ.. ఆధారాలు లేని సాధారణ ఆరోపణలు చేశారు” అని పేర్కొన్నారు. అక్టోబర్ 7 దాడికి దారితీసిన పరిణామాలపై దర్యాప్తును అడ్డుకొని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన తనపై చర్యలు తీసుకొన్నట్లు అభివర్ణించారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన పాశవిక దాడుల్లో నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత తమదేనని ఇజ్రాయెల్ 2023లోనే షిన్‌బెట్ అంగీకరించింది. ఈ దాడుల్లో 1,300 మంది ఇజ్రాయెల్ వాసులు సహా విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాతే గాజాపై ఇజ్రాయెల్ భారీస్థాయిలో యుద్ధం ప్రకటించింది. హమాస్ మెరుపు దాడిపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు.