- రేపు ఓటింగ్
- రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి
సియోల్ : దేశంలో సైనిక పాలన విధించేందుకు యత్నించి భంగపడిన అధ్యక్షుడు యూన్ సుక్ యేల్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై చర్చ అనంతరం శనివారం ఓటింగ్ జరుగుతుంది. కొరియా రాజ్యాంగ నిబంధనల ప్రకారం అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 72గంటల్లోగా దానిపై ఓటింగ్ జరగాలి. లేకుంటే ఆ తీర్మానం రద్దయినట్లు పరిగణిస్తారు. అప్పుడు మళ్లీ తీర్మానం తేవాల్సి వుంటుంది. పాలక కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీ (పిపిపి) నేత హన్ డాంగ్ హూన్ మాత్రం ఈ అభిశంసన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాజకీయ అస్థిరత నెలకొంటుందని వాదిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అధ్యక్షునిపై అభిశంసన తీర్మాన ప్రక్రియ చేపట్టారు. మరోవైపు అధ్యక్షుడు యూన్ సుక్ యేల్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు రాజీనామా చేయకుంటే దేశ వ్యాపిత సమ్మెకు వెళ్తామని కొరియన్ కార్మిక సంఘాల సమాఖ్య (కెసిటియు) హెచ్చరించింది. రాజకీయ పార్టీలు, పౌర సమాజం వరుసగా రెండో రోజు కూడా నిరసనలతో హోరెత్తించాయి.
రక్షణ మంత్రి రాజీనామా
దక్షిణ కొరియా రక్షణ మంత్రి రాజీనామాను గురువారం అధ్యక్షుడు యూన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో మంత్రి రాజీనామా వెలువడింది. ప్రతిపక్షాలు ప్రభత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, కమ్యూనిస్టు ఉత్తర కొరియా పట్ల సానుభూతి చూపిస్తున్నాయన్న సాకుతో అధ్యక్షుడు మంగళవారం రాత్రి దేశంలో సైనిక పాలన విధించారు. అయితే ఈ సైనిక పాలనను ప్రకటించిన కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకున్నారు. అయితే, పార్లమెంట్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో సైనిక పాలన రద్దయింది. దీంతో రక్షణ మంత్రి కిమ్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రిటైర్డ్ ఫోర్ స్టార్ జనరల్ చోరు బుయాంగ్ హైక్‌ను అధ్యక్షుడు వెంటనే నియమించారు. మార్షల్ లాను ఎత్తివేశామని ప్రకటించినప్పటి నుండి అధ్యక్షుడు బహిరంగంగా కనిపించలేదు.