- దురాక్రమణ పూరిత దాడులు ఆపాలని డిమాండ్
- దాడులు కొనసాగుతాయంటూ హూంకరిస్తున్న నెతన్యాహు
బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణపూరిత దాడులు, హిజ్బుల్లా నేతల హత్యలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల తదనంతర పర్యవసానాలకు ఇజ్రాయిల్, దానికి అండదండలిస్తున్న అమెరికా కాపూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాయి. పశ్చిమాసియాను అస్థిరపరిచే యూదు దురహంకార ఇజ్రాయిల్ దాడులను తక్షణమే ఆపాలని అవి డిమాండ్ చేశాయి. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్య జరిగి 24 గంటలు కూడా తిరక్క ముందే మరో హిజ్బుల్లా నేత నబిల్ కౌక్‌ను ఇజ్రాయిల్ సైన్యం దుర్మార్గంగా హత్య చేసింది. హిజ్బుల్లా నాయకత్వాన్ని తుడిచిపెట్టడంలోతాము విజయం సాధించామని, అయినా దాడులు కొనసాగుతాయని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా యుద్దోన్మాది ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు హూంకరించాడు. తాజాగా సిరియాపై దాడికి దిగాడు. దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చేందుకు అమెరికా మద్దతుతో నెతన్యాహు ప్రయత్నిస్తున్నాడు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దురాక్రమణపూరిత దాడులు, హిజ్బుల్లా చీఫ్ హత్యను అరబ్బు దేశాలతో బాటు చైనా, రష్యా, క్యూబా, వెనిజులా, అర్జెంటీనా, కొలంబియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా మాత్రం ఇది ఉగ్రవాదుల చేతిలో బలైన వేలాది మంది అమాయక పౌరులకు చేకూరిన న్యాయం అని అభివర్ణించింది. అమెరికా మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు సైతం ఈ దాడుల తాలూకు పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. నస్రల్లా హత్యను పిరికిపంద, ఉగ్రవాద చర్య అని హమాస్ ఖండించింది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దురాగతాలకు ప్రతిఘటన కొనసాగుతుందని స్పష్టం చేసింది. బీరుట్‌లో గత 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఐరాస చీఫ్ అంటోని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
జాత్యహంకారంతో ఇతరులపై దాడి చేసే ఇటువంటి చర్యలను తాము చూస్తూ ఊరుకోబోమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫొసా ఇజ్రాయిల్‌ను హెచ్చరించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. పశ్చిమాసియాలో పరిణామాలకు ఇజ్రాయిలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇజ్రాయిల్ పాశవిక దాడులు పశ్చిమాసియా ప్రాంత భద్రతకే కాదు, ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పు అని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ ఆందోళన వ్యక్తం చేశారు. లెబనాన్‌పై మిలిటరీ చర్యను పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసేలా ఉందని రష్యా విదేంగ మంత్రి లావ్రోవ్ హెచ్చరించారు. లెబనాన్‌పై దాడిని సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్,యెమెన్ వంటి అరబ్బు దేశాలు ఖండించాయి. తక్షణమే దాడులను విరమించాలని ప్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అర్జెంటీనా కోరాయి.
మరో హిజ్బుల్లా నేత నబిల్ కౌక్ హత్య నస్రల్లా వారసుడిగా సఫీద్
దక్షిణ బీరుట్ పై ఇజ్రాయిల్ సైన్యం శనివారం జరిపిన క్రూరమైన దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన మరో కీలక నేత నబిల్ కౌక్ మరణించాడు. హిజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ అధిపతిగా ఉన్న కమాండర్ నబిల్ హత్యతో హిజ్బుల్లా ప్రధాన నాయకత్వాన్నంతటినీ అంతమొందించామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదని హిజ్బుల్లా సంస్థ హెచ్చరించింది. నస్రల్ హత్య హిజ్బుల్లా చరిత్రలోనే అతిపెద్ద దెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. దీని నుంచి కోలుకునేందుకు నస్రల్లా స్థానంలో ఆతని బంధువు, హిజ్బుల్లా రాజకీయ విభాగం అధిపతిగా ఉన్న సఫీద్ నియమితులయ్యారు. 1964లో దక్షిణ లెబనాన్‌లో డెయిర్ కాన్సుల్‌లో జన్మించిన సఫీద్ ఆరేళ్ల క్రితం అమెరికా దాడి చేసి చంపిన ఇరాన్ మిలిటరీ చీఫ్ సులేమాన్‌కు మామ కూడా.