ఇమ్మిగ్రేషన్‌పై రాజుకుంటున్న వివాదం

అంతుచిక్కని ట్రంప్‌ ఆంతర్యం
హెచ్‌-1బి వీసాల జారీపై ఆంక్షలు ఉండొచ్చని అనుమానాలు
పొంచివున్న ‘మాగా’ మూవ్‌మెంట్‌ ముప్పు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు కొనసాగుతున్న తరుణంలో ఇమ్మిగ్రేషన్‌పై వివాదం రాజుకుంటోంది. హెచ్‌-1బి వీసాలపై వాడిగా, వేడిగా రాజకీయ చర్చ నడుస్తోంది. విదేశీ నిపుణులను తాత్కాలిక ప్రాతిపదికపై నియమించుకునేందుకు యాజమాన్యాలను అనుమతించేదే ఈ హెచ్‌-1బి వీసా కేటగిరీ. ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్‌ హెచ్‌-1బి వీసా కార్యక్రమాన్ని సమర్ధించారు. తాను ఎప్పుడూ వీసాలను ఇష్టపడతానని, వాటిపై తనకు నమ్మకం ఉన్నదని ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ గందరగోళ సంకేతాలు వస్తూనే ఉన్నాయి.
భారతీయులే అధికం
గత నాలుగు సంవత్సరాల కాలంలో అమెరికాలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న హెచ్‌-1బి దరఖాస్తుదారుల్లో 78 శాతానికి పైగా భారతీయులే. వారి ప్రతిపాదిత వార్షిక వేతనం పది లక్షల డాలర్లు దాటుతోంది. ఈ విధంగా అత్యధిక వేతనాలు పొందుతున్న భారతీయుల్లో 25 శాతం మంది మహిళలు ఉన్నారు. మన దేశానికి చెందిన హెచ్‌-1బి దరఖాస్తుదారుల్లో 65 శాతం మందిని అమెరికాలోని చిన్న కంపెనీలు స్పాన్సర్‌ చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు స్పాన్సర్‌ చేసే హెచ్‌-1బి వీసా దరఖాస్తుదారులకు మన దేశంలోని కంపెనీలు స్పాన్సర్‌ చేస్తున్న విదేశీయుల కంటే అధిక వేతనాలు వస్తున్నాయి. అందుకే అమెరికాలో ఉద్యోగాల కోసం యువత పరుగులు పెడుతోంది.

హెచ్‌-1బి వీసా అంటే ?
అసలు హెచ్‌-1బి వీసా అంటే ఏమిటి? వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన విదేశీయులను ఆ నిపుణత అవసరమైన ఉద్యోగాల్లో తాత్కాలికంగా నియమించుకునేందుకు హెచ్‌-1బి నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలు అనుమతిస్తాయి. నిర్దిష్ట విభాగంలో బ్యాచ్‌లర్‌ లేదా హయ్యర్‌ డిగ్రీ ఉన్న వారు ఈ వీసాలు పొందేందుకు అర్హులు. హెచ్‌-1బి కార్యక్రమాన్ని అమెరికా ప్రతినిధి సభ 1990లో ప్రారంభించింది. ప్రారంభంలో దీని కింద ఆర్థిక సంవత్సరంలో 65,000 మందికి అవకాశం లభించేది. 2004 నుండి దానిని 85,000కు పెంచారు. ఇందులో 20,000 వీసాలు అమెరికా యూనివర్సిటీల నుండి మాస్టర్‌ డిగ్రీలు చేసిన లేదా అధిక విద్యార్హతలు పొందిన వారికి రిజర్వ్‌ చేశారు. ఈ వీసాలను మూడు సంవత్సరాల కాలప రిమితికి మాత్రమే మంజూరు చేస్తున్నప్పటికీ ఆరు సంవత్స రాల వరకూ పొడిగించవచ్చు. హెచ్‌-1బి వీసా కోసం వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలంటే అమెరికాలోని కంపెనీ లేదా సంస్థ ఉద్యోగాన్ని స్పాన్సర్‌ చేయాల్సి ఉంటుంది. తమ దేశంలో అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి అమెరికా ప్రభుత్వం వీసా పొడిగింపులు కూడా ఇస్తోంది.

లాటరీ ద్వారా ఎంపిక
అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌) వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2023లో (2022 అక్టోబర్‌ నుండి 2023 సెప్టెంబర్‌ వరకూ) 3,86,000 హెచ్‌-1బి దరఖాస్తులను ఆమోదించారు. వీటిలో 1,19,000 కొత్త వీసాలు కాగా సుమారు 2,67,000 వీసాలు పొడిగింపులకు సంబంధించినవి. 2022లో 4,74,000 వీసాలకు అనుమతి ఇవ్వగా 2023లో ఆ సంఖ్య తగ్గింది. తాజా సమాచారం ప్రకారం వీసాల్లో 72 శాతం భారతీయులకు మంజూరు చేసినవే. 12 శాతం వీసాలతో చైనా రెండో స్థానంలో ఉంది. హెచ్‌-1బి వీసాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. యూఎస్‌సీఐఎస్‌ ప్రచురించిన అర్హత పొందిన రిజిస్ట్రేషన్ల సంఖ్యను పరిశీలిస్తే…2023లో 4,74,421 దరఖాస్తులు రాగా 2024లో 7,58,994 దరఖాస్తులు వచ్చాయి. అందుబాటులో ఉన్న వీసాల కంటే ఈ సంఖ్య అధికంగా ఉండడంతో లాటరీ తీసి దరఖాస్తుదారులను ఎంపిక చేస్తున్నారు. అయితే దీనిపై పలువురు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పనిచేస్తున్న రంగాలు ఇవే
అనుమతి లభించిన దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణిత రంగాల్లో పని చేస్తున్నారు. వీరిలోనూ కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాల్లో పని చేస్తున్న వారు ఎక్కువ. 2023 ఆర్థిక సంవత్సరంలో వీసా అనుమతులు పొందిన వారిలో 65 శాతం మంది ఈ తరహా ఉద్యోగాలు చేస్తున్న వారే. పది శాతం మంది ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌, సర్వేయింగ్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక యాజమాన్యాల విషయానికి వస్తే 2024లో హెచ్‌-1బి వీసా దరఖాస్తుదారుల్లో ఎక్కువ మందిని అమెజాన్‌ తీసుకుంది. ఈ కంపెనీ 13,000 మంది విదేశీయులను నియమించుకుంది.

అవరోధంగా మారిన ‘మాగా’
ట్రంప్‌ 2.0 హయాంలో వీసా కార్యక్రమంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇమ్మిగ్రేషన్‌ను పరిమితం చేయడం ట్రంప్‌ ప్రభుత్వ అజెండాగా ఉంది. 2017లో ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల కారణంగా తిరస్కరణకు గురైన హెచ్‌-1బి వీసాల రేటు నాలుగు రెట్లు పెరిగి 24 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో హెచ్‌-1బి వీసాల చుట్టూ సాగు తున్న చర్చలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ట్రంప్‌ 1.0 హయాంలో ఎన్ని హెచ్‌-1బి దరఖాస్తులకు అనుమతి లభించిందో బైడెన్‌ పాలనలోనూ అన్ని దరఖాస్తులనే ఆమోదించారు. అయినప్పటికీ మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా) పేరిట మొదలైన ఉద్యమం దరఖాస్తుదారుల్లో ఆందోళనలను పెంచుతోంది. ట్రంప్‌కు సన్నిహితులుగా ఉండే వ్యాపార వేత్తలు ఎలన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామి విదేశీ ఉద్యోగుల వీసా కార్యక్రమాన్ని సమర్ధించడం ఊరట కలిగించే విషయం. వీరిద్దరూ ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించబోతున్నారు. కానీ ‘మాగా’ మద్దతుదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్మిగ్రేషన్‌ను పరిమితం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్‌ బానన్‌ హెచ్‌-1బి వీసా కార్యక్రమాన్ని ఓ కుంభకోణంగా అభివర్ణించారు. ఆయన తాజాగా మస్క్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ విదేశీ నిపుణులు అమెరికాలో అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగాలను ఎలా చేపడతారని ప్రశ్నించారు. ప్రతినిధి సభ మాజీ సభ్యుడు, ట్రంప్‌ సహచరుడు మాట్‌ గెట్జ్‌ కూడా మాగాకు మద్దతుదారుడే. ట్రంప్‌ ప్రభుత్వ ఏఐ విధాన సలహాదారుగా సిలికాన్‌ వ్యాలీ వెంచర్‌ పెట్టుబడిదారుడు శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించడంపై ట్రంప్‌ మద్దతుదారులు మండిపడుతున్నారు. అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పరిమితులపై ఉన్న ఆంక్షలన్నింటినీ తొలగించాలని కోరుతున్న వ్యక్తిని నియమిస్తే దేశంలో ఇమ్మిగ్రేషన్‌ను ఎలా నియంత్రించగలమని వారు నిలదీశారు. అమెరికాలో ఇలాంటి నిరసన గళాలు రాజకీయ నిర్ణయాలను మార్చగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మస్క్‌ కూడా హెచ్‌-1బి వీసాపై అంతర్జాతీయ విద్యార్థిగా అమెరికా వెళ్లి అక్కడే పని చేస్తున్నారు.

➡️