గాజాలో యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ కార్యాలయాలే లక్ష్యం

Jul 11,2024 08:01 #Gaza, #UNRWA offices

– నాలుగు స్కూలు భవనాలు, మూడు ఆస్పత్రులపై దాడులు
-27మంది మృతి
-చర్చలు కష్టమేనన్న హమాస్‌
గాజా : గాజా నగరంలోని యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు చేస్తామని, ప్రజలందరూ నగరం నుండి ఖాళీ చేయాలని ఇజ్రాయిల్‌ ఆర్మీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందా అని వెతుకుతూ వేలాదిమంది తరలిపోతుండడం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాలన్నీ ప్రమాదకరమైన జోన్‌లుగా మారతాయని ఈలోగా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోవాలని ఆర్మీ ఇప్పటికే హెచ్చరించింది. దాడుల్లో ఖాన్‌ యూనిస్‌ నగరం శిధిలాల దిబ్బగా మారడంతో అక్కడి ప్రజలు గాజాలో తల దాచుకున్న స్కూలు భవనంపై మంగళవారం ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 27మంది మరణించగా, 53మంది గాయపడ్డారు. ఉత్తర గాజాలో మొత్తంగా నాలుగు స్కూలు భవనాలు దాడులకు గురై తీవ్రంగా ధ్వంసమవగా, మూడు కీలకమైన ఆస్పత్రులు కూడా మూతపడ్డాయి. వేలాదిమంది పాలస్తీనియన్లు ఇతర ప్రాంతాలకు పారిపోయారు. స్కూళ్ళపై దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను ఈ దాడులు తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్‌ ఫిలిప్‌ లాజారిని ఖండించారు. సెంట్రల్‌, పశ్చిమ రఫాల్లో కూడా ఇజ్రాయిల్‌ ముమ్మరంగా దాడులు జరుపుతోంది. ఈజిప్ట్‌లో చర్చల అనంతరం ఖతార్‌లో బుధవారం నుండి కాల్పుల విరమణ ఒప్పందంపై మరోసారి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. 9మాసాలుగా సుదీర్ఘంగా సాగుతున్న దాడులతో గాజా నగరంలో మెజారిటీ ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడా భవంతి అనేది కనిపించడం లేదు. దక్షిణ గాజాలో చాలామంది ప్రజలు యుద్ధ భయంతో ముందుగానే పారిపోగా, ఉత్తర ప్రాంతంలో ఇంకా వేలాదిమంది వున్నారు. ‘కదులుతున్న దేనిపైన అయినా దాడి చేస్తున్నారు. దాడులు చాలా ఉధృతంగా సాగుతున్నాయి.” అని గాజా నగరంలోని తుఫా జిల్లా నుండి పారిపోయిన ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు. సెంట్రల్‌ జిల్లాల్లోకి ట్యాంకులు ప్రవేశించాయన్నారు. కాగా ఈ దాడులన్నీ కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చల ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని హమాస్‌ హెచ్చరించింది.

➡️