ప్రజల ఐక్యతే కీలకం

  • సమర్ధవంతంగా టెక్నాలజీని వినియోగించాలి
  • అర్జెంటీనా కంప్యూటర్‌ సైన్స్‌ ఫ్రొఫెసర్‌ జేవియర్‌ బ్లాంగో

హవానా నుండి ప్రత్యేకం : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పై చేయి సాధిస్తున్న తీవ్ర మితవాద (ఆల్ట్‌-రైట్‌) విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రజల మధ్య పటిష్టమైన ఐక్యతను నిర్మించాల్సిఉందని అర్జెంటీనాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ కార్జొబ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ అన్నారు. హవానాలో క్యూబన్‌ ప్రెస్‌ డే సందర్భంగా ఆ దేశానికి చెందిన యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ ఆఫ్‌ క్యూబా నిర్వహిస్తున్న (యుపిఇసి)’పాట్రియా ఇంటర్నేషనల్‌ కొలోక్యూమ్‌ 4వ ఏడిషన్‌ ‘అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, వాటి ప్రాధాన్యత, లాటిన్‌ అమెరికాలోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. సహకార రంగంలో ఇంటర్‌నెట్‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించాలని కోరారు. వివరాలు క్లుప్తంగా

ప్ర: ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
జ : ఇప్పుడు జరుగుతున్న సమావేశంలోనూ మనం అదే చర్చిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు , రాజకీయాలు, టెక్నాలజీల మధ్య ఉన్న సంబంధాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నిజానికి మారుతున్న టెక్నాలజీ మన సంభాషణ సాధనాలను, తద్వారా రాజకీయాలను పునరావిష్కరిస్తోంది. అందువల్ల దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేం. ఈ సమావేశంలో 50కి పైగా దేశాల ప్రతినిధులు ఈ దిశలోనే తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అదే విధంగా వివిధ దేశాల ప్రజలకు వారి సొంత అవసరాలు ఉంటాయి. వాటికనుగుణంగా స్వంత, స్వతంత్ర విధానాలు కూడా అత్యవసరం.

ప్ర: లాటిన్‌ అమెరికాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
జ: లాటిన్‌ అమెరికా తీవ్ర మితవాద శక్తుల కారణంగా రాజకీయ అశాంతిని ఎదర్కుంటోంది. నేను అర్జెంటీనా నుండి వచ్చాను. మా ప్రస్తుత ప్రభుత్వం నూతన సరళీకరణ ఆర్థిక విధానాలు, తీవ్ర మిత వాద భావాజాలల కలయికతో నడుస్తోంది. మా దేశంలోనే కాదు. అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈ ప్రాంతంలోని ప్రగతిశీల ప్రభుత్వాలు కూడా ఈ మితవాద శక్తుల దాడులకు తరచు గురవుతున్నాయి. ఈ శక్తుల నుండి మన ప్రజలను రక్షించుకోవడానికి, సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడానికి మనం వ్యూహాత్మకంగా పనిచేయాల్సిఉంది.

ప్ర లాటిన్‌ అమెరికాలో సామ్యవాద భవిష్యత్తు ఏమిటి?
జ: పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉందని చెప్పవచ్చు . 2000 సంవత్సరం నుండి ఏర్పడుతున్న ప్రగతి శీల ప్రభుత్వాలు పూర్తి స్వేఛ్చగా పనిచేయలేకపోతున్నాయి. ఆర్థిక శక్తుల నియంత్రణకు గురవుతున్నాయి. వామపక్ష విధానాలను అమలు చేయలేకపోతున్నాయి, ఈ పరిస్థితిని మార్చాలి. లేకపోతే ప్రజలు మరిన్ని బాధలు పడతారు. క్యూబా పోరాటాల్లో కనిపించినట్లు ప్రజలను ఐక్యం చేయాలి. లాటిన్‌ అమెరికాలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పని జరగాలి. దీనికోసం అవసరమైతే కొత్త అజెండాను అన్వేషించాలి.

ప్ర : క్యూబా ఎదర్కుంటున్న సవాళ్లు ఏమిటి?
జ: క్యూబా ఇప్పుడు తీవ్రమైన ఇంధన కొరతలను ఎదుర్కుంటుంది. విద్యుత్‌ లేకుండా ప్రజలు కొన్ని రోజులు ఉండాల్సివచ్చింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ప్రజల కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ఇంటర్నెట్‌ ఆగిపోవడంతో
ఇమెయిల్‌ వంటి తక్షణ సౌకర్యాలు సైతం నిలిచిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధి కోసం సహకార ఇంటర్నెట్‌ ప్రాజెక్టుల వంటి వినూత్న ప్రయోగాల వైపు దృష్టి సారించాలి.

-బి. తులసీదాస్‌

➡️