- నిర్ధారించిన వెబ్ టెలిస్కోప్ డేటా
న్యూయార్క్ : విశ్వం ఊహించిన దానికన్నా అసాధారణ వేగంతో విస్తరిస్తోందని వెబ్ టెలిస్కోప్ డేటా ధ్రువీకరించింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రెండేళ్ళపాటు ఇచ్చిన డేటా గతంలో హబుల్ రోదసీ టెలిస్కోప్ ఇచ్చిన డేటాతో సరిపోలుతోంది. విశ్వం విస్తరించే రేటు దాదాపు 8శాతం వేగంగా వుందని గతంలో హబుల్ పేర్కొంది. వందల కోట్ల సంవత్సరాల కాలంలో కాస్మోస్ కాంతి కిరణాల్లో తొలినాటి పరిస్థితులు, తదనంతర కాలంలో పరిణామ క్రమం గురించి ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు తెలుసుకున్న సమాచారం ప్రాతిపదికగా కన్నా చాలా వేగంగా విశ్వం విస్తరిస్తోందని భావించారు. అందుకే ఈ తేడాను హుబుల్ టెన్షన్‌గా పిలుస్తారు. మన దగ్గర గల అత్యుత్తమ సిద్ధాంతాలు పేర్కొన్నదాని కన్నా చాలా వేగంగా విశ్వం విస్తరిస్తోందని మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆదమ్ రీస్ పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలోని బృందం చేసిన అధ్యయన నివేదికను అస్ట్రో ఫిజికల్ జర్నల్‌లో సోమవారం ప్రచురించారు. ఇప్పటివరకు విశ్వం గురించి మన అవగాహనలో కొంత భాగం కోల్పోయినట్లు కనిపిస్తోందని రీస్ పేర్కొన్నారు. ప్రధానంగా రెండు అంశాలు – కృష్ణ బిలం, కృష్ణ శక్తి (డార్క్ మేటర్, డార్క్ ఎనర్జీ) గురించి మనం విస్మరించామని, కానీ అవే ఈ విశ్వంలో 96శాతం వున్నాయని అన్నారు. అందువల్ల ఇదేమీ చిన్న విషయం కాదన్నారు. 13-14 వందల కోట్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్ బ్యాంగ్‌తో ఈ విశ్వం ఆవిర్భవించింది, అప్పటి నుండి క్రమంగా విస్తరిస్తూనే వస్తోంది.