ఆల్కహాల్‌, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ అధిక పన్నులు వేస్తోంది

Mar 12,2025 22:42 #America, #tarrif
  • అమెరికా ఆరోపణ

వాషింగ్టన్‌ : భారత్‌ తన ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని అమెరికా మరోసారి ఆరోపించింది. అమెరికా ఆల్కహాల్‌, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ ఎక్కువ సుంకాన్ని విధిస్తోందని శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవెట్‌ చెప్పారు. కెనడాపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘కెనడా కొన్ని దశాబ్దాలుగా అమెరికాను, అమెరికా ప్రజలను నానా ఇబ్బందులు పెడుతోంది. ఇక్కడి అమెరికా ప్రజలు, కార్మికులపై కెనడా వారు విధిస్తున్న సుంకాలను చూస్తుంటే అవి ఎంత విపరీతంగా ఉన్నాయో తెలుస్తుంది. కేవలం కెనడా విధించే సుంకాలే కాదు…అనేక దేశాలు విధిస్తున్న సుంకాల జాబితా కూడా నా వద్ద ఉంది. అమెరికా వెన్న, జున్నుపై కెనడా సుమారు 300 శాతం సుంకాన్ని విధిస్తోంది’ అని ఆమె మండిపడ్డారు. కాగా కెనడాపై డబుల్‌ సుంకాల వేసే విషయంలో అగ్రరాజ్యం అధినేత యూటర్న్‌ తీసుకున్నట్టు సమాచారం. ‘ఇక భారత్‌ విషయానికి వస్తే అమెరికా ఆల్కహాల్‌పై 150 శాతం సుంకాన్ని వసూలు చేస్తోంది. మన కెంటుకీ బర్బన్‌ విస్కీని భారత్‌కు ఎగుమతి చేయడానికి ఇది దోహదపడుతుందని మీరు భావిస్తున్నారా? నేను అలా అనుకోవడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులపై కూడా భారత్‌ 100 శాతం సుంకం వేస్తోంది. బియ్యం రవాణాపై జపాన్‌ ఏకంగా 700 శాతం సుంకాన్ని వసూలు చేస్తోంది’ అని కరోలినా లీవెట్‌ తెలిపారు. లీవెట్‌ వద్ద ఉన్న ఛార్టులో కెనడా, భారత్‌, జపాన్‌ విధిస్తున్న సుంకాల సమాచారం ఉంది. ప్రతీకార సుంకాలు విధించాలని ట్రంప్‌ భావిస్తున్నారని ఆమె చెప్పారు. అమెరికా వ్యాపారులు, కార్మికుల ప్రయోజనాల గురించే ఆయన ఆలోచిస్తున్నారని అన్నారు.

➡️