ప్రపంచంలో దేశాల మధ్య సంఘీభావం, సమన్వయం అవశ్యం !

  • చైనా నేత జిన్‌పింగ్‌ స్పష్టీకరణ
  • అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో భేటీ

బీజింగ్‌ : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌తో చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ గురువారం ఇక్కడి గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌ భవనంలో సమావేశమయ్యారు. ప్రస్తుతం వేగంగా మారుతున్న పరిణామాలు, అల్లకల్లోలంగా వున్న నేటి ప్రపంచంలో దేశాల మధ్య సంఘీభావం, సమన్వయం వుండాల్సిన అవసరం వుందని, కానీ విభజన లేదా సంఘర్షణలు కాదని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. పారదర్శకత, పురోగతిని ప్రజలు కోరుకుంటారని, అంతేకానీ బహిష్కరణలు లేదా తిరోగమనాలు కోరుకోరని ఆయన వ్యాఖ్యానించారు. రెండు ప్రధాన దేశాలుగా చైనా, అమెరికాలు చరిత్రకు, ప్రజలకు, యావత్‌ ప్రపంచానికి బాధ్యత వహించాల్సి వుందన్నారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి అభివృద్ధి ప్రయోజనాలకు ఒక స్థిరమైన వనరుగా వుండాలని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల్లోనూ అలాగే చైనా-అమెరికా సంబంధాల్లోనూ గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. సుస్థిరమైన, ఆరోగ్యకరమైన, నిలకడతో కూడిన చైనా-అమెరికా సంబంధాల పట్ల చైనా నిబద్దత విషయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, సమాన అవకాశాలు, సహకారం ప్రాతిపదికన సంబంధాలు కొనసాగాలన్న మౌలిక సూత్రంలో మార్పు లేదన్నారు. దేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల విషయంలో చైనా వైఖరి ధృఢంగా వుందన్నారు. చైనా, అమెరికా ప్రజల మధ్య నెలకొన్న సాంప్రదాయ స్నేహ బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో కూడా ఎలాంటి మార్పు లేదని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. అమెరికా కూడా ఇదే దిశా నిర్దేశంతో చైనాతో కలిసి పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనాను, చైనా అభివృద్ధిని సానుకూల, సహేతుకమైన కోణంలో చూడగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. పరస్పర అభివృద్ధిని సవాలుగా తీసుకోవడం కన్నా ఒక అవకాశంగా చూడాల్సి వుందన్నారు. రెండు దేశాలు కలిసి ముందుకు సాగేందుకు సరైన మార్గాన్ని కనుగొనడంలో చైనాతో కలిసి పనిచేయగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

➡️