- పలు సహకార ఒప్పందాలపై చైనా, వియత్నాం సంతకాలు
- హనోయ్ లో చైనా నేత జిన్‌పింగ్ పర్యటన
హనోయ్ : సహకార బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా, వియత్నాంలు నిర్ణయించాయి. ఉత్పత్తి, సరఫరాలకు సంబంధించి పలు సహకార ఒప్పందాలపై కూడా చైనా, వియత్నాలు సోమవారం సంతకాలు చేశాయి. రైల్వే సహకారంపై కూడా ఇరు పక్షాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మొత్తంగా 45 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టో లామ్‌తో జిన్‌పింగ్ భేటీ అనంతరం ఈ సంతకాలు చోటు చేసుకున్నాయి.
వాణిజ్యం, సరఫరా వ్యవస్థలకు సంబంధించి వియత్నాంతో మరింత బలమైన సంబంధాలు నెలకొనాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆకాంక్షించారు. ఆగేయాసియా దేశాల పర్యటనలో భాగంగా తొలుత వియత్నాంలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ, రక్షణ వాదం పట్ల హెచ్చరించారు. వాణిజ్య యుద్ధాల వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదని, ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ వుండరని పునరుద్ఘాటించారు. బహుళ వాణిజ్య వ్యవస్థను కచ్చితంగా పరిరక్షించాల్సి వుందని స్పష్టం చేశారు. పారదర్శకమైన, సహకారంతో కూడిన అంతర్జాతీయ వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సి వుందన్నారు. ట్రంప్‌తో టారిఫ్‌ల వివాదం కొనసాగుతున్న వేళ జిన్‌పింగ్, మలేసియా, కంబోడియా, వియత్నాంలో పర్యటించనున్నారు. ఈ నెల 18 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సుస్థిరమైన అంతర్జాతీయ పారిశ్రామిక వ్యవస్థను, సరఫరాల వ్యవస్థలను కాపాడుకోవాల్సి వుందన్నారు. సోమవారం వియత్నాంలో చైనా నేత పర్యటనను పురస్కరించుకుని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ వార్తాపత్రిక నాన్‌దన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. కృత్రిమ మేథ, హరిత ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి కూడా హనోరుతో మరింత బలమైన సం బంధాలు వుండాలని జిన్‌పింగ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.