- ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు
వాషింగ్టన్ : అమెరికాకే తమ ప్రాధాన్యత, అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమంటూ ఎన్నికల ప్రచార సమయం నుండి చెప్పుకుంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే వరుసగా తాననుకున్న చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మెక్సికో, కెనడా, చైనాల నుండి వచ్చే దిగుమతులపై అదనపు టారిఫ్‌లు విధించారు. ఈ మేరకు శనివారం ఆయన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ టారిఫ్‌లు మంగళవారం నుండి అమల్లోకి రానున్నాయి. అమెరికన్లను రక్షించేందుకు ఈ టారిఫ్‌లు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఫెంటనిల్ అక్రమ తయారీ, ఎగుమతులపై మరిన్ని చర్యలు తీసుకోవాలని చైనాను కోరారు. అలాగే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్యను కెనడా, మెక్సికోలు తగ్గించాలని ట్రంప్ పేర్కొన్నారు.
చైనా నుండి వచ్చే దిగుమతులన్నింటిపై 10శాతం, అలాగే చైనా మెక్సికో, కెనడాల నుండి వచ్చే దిగుమతులపై 25శాతం సుంకాలు విధించడానికి గానూ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ట్రంప్ ప్రకటించారు. కెనడా నుండి చమురు, ఖనిజ వాయువు, విద్యుత్‌లను దిగుమతి చేసుకుంటారు. వాటిపై పది శాతం చొప్పున పన్ను విధించనున్నారు. ఇతర దేశాలు తీసుకునే ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా అమెరికా వసూలు చేసే రేట్లను పెంచే యంత్రాంగం కూడా ట్రంప్ ఉత్వర్వుల్లో వుంది. దీంతో మరింత తీవ్రమైన ఆర్థిక అంతరాయం తలెత్తే పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నారు.
ఈ చర్యలతో సుదీర్ఘంగా మిత్రపక్షాలుగా వున్న దేశాలతో వాణిజ్య యుద్ధానికి పురి గొల్పినట్లైంది. అలాగే ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చిన మేరకు నిత్యావసరాల ధరలు, గ్యాసోలిన్, ఇళ్ల నిర్మాణం, ఆటోలు, ఇతర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశపడ్డారు. కానీ ట్రంప్ తాజా చర్యలతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ టారిఫ్‌లు ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వృద్ధికి అంతరాయం కలుగుతుందని, పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశముందని భయపడుతున్నారు.
కాగా ఈ చర్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టంపై యేలే లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషణ జరిపింది. సగటు అమెరికన్ కుటుంబం ఈ పన్నుల వల్ల తన ఆదాయంలో 1170డాలర్ల మేరకు నష్టపోతుందని పేర్కొంది. వృద్ధిరేటు మందగిస్తుందని, ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెచ్చరిల్లుతాయని, ఇతర దేశాలు తీసుకునే ప్రతీకార చర్యలతో పరిస్థితి మరింత దిగజారుతుందని పేర్కొంది. డెమోక్రాట్లు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న చర్యల ఫలితమే రాబోయే పరిస్థితులని హెచ్చరించారు.