ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ బందీలుగా ఉంచిన 80 మంది రైలు ప్రయాణికులను పాకిస్తాన్ సైన్యం విడిపించింది. 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది పిల్లలు సహా 80 మంది బందీలను ఉగ్రవాదుల నుండి భద్రతా దళాలు విజయవంతంగా విడిపించాయని భద్రతా వర్గాలు తెలిపాయి. మిగిలిన ప్రయాణీకులను సురక్షితంగా విడుదల చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కూడా వారు తెలిపారు. పాకిస్తాన్‌లోని వాయవ్య బెలూచిస్తాన్‌లో ప్రయాణికుల రైలును సాయుధ తీవ్రవాదులు మంగళవారం హైజాక్ చేశారు. 182మందికి పైగా ప్రయాణికులన బందీలుగా తీసుకున్నారు. రైలు డ్రైవర్‌ను గాయపరిచారని అధికారులు తెలిపారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు రైలు ప్రయాణిస్తుండగా, బోలన్ జిల్లాలో ఈ దాడి జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు.
భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భారీ కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో రైలు డ్రైవర్, ఒక పోలీసు అధికారి, ఒక సైనికుడు మరణించారని పారామెడిక్ నజీమ్ ఫరూక్, రైల్వే అధికారి ముహమ్మద్ అస్లాంలు మాక్ రైల్వే స్టేషన్‌లో తెలిపారు.
9 బోగీలు వున్నా రైల్లో దాదాపు 500 మంది ప్రయాణికులు వుంటారని రైల్వే కంట్రోలర్ తెలిపారు. సొరంగం నెంబరు 8లో రైలును సాయుధులు ఆపేశారు. ట్రాక్‌ను పేల్చేసి..ఉగ్రవాదులు ట్రైన్‌ను హైజాక్ చేశారు.