పాకిస్తాన్ : మంగళవారం ఉదయం క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బెలూచిస్తాన్ బోలన్ జిల్లాలో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. సమాచారమందిన వెంటనే పాకిస్తాన్ సైనిక బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులతో కాల్పులు జరిపారు. వరుసగా రెండో రోజు బుధవారం కూడా పాకిస్తాన్ భద్రతా దళాలు ఉగ్రవాదులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అలాగే 104 మంది ప్రయాణీకులను భద్రతా దళాలు రక్షించాయి. ఇంకా డజన్ల కొద్దీ ప్రయాణీకులు ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సైనిక బలగాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కాగా, రైలు హైజాక్ ఘటనపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉగ్రవాదుల చర్యను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా తీవ్రంగా ఖండించారు. బందీలను తక్షణమే విడుదల చేయాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు.
