- ట్రంప్ ప్రభుత్వ డిమాండ్లను తోసిపుచ్చడమే కారణం
బోస్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్లను ధిక్కరించినందుకు హార్వ్వర్డ్ యూనివర్శిటీకి దాదాపు 230 కోట్ల డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసినట్లు అమెరికా విద్యా శాఖ ప్రకటించింది. భిన్నత్వం, సమానత్వం, అందరినీ కలుపుకుని పోవడం వంటి కార్యక్రమాలను ఆపివేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే ఆ డిమాండ్లను అంగీకరించని యూనివర్శిటీ యాజమాన్యం వీటిపై పోరాడాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. యూదు వ్యతిరేక వాదంతో ట్రంప్ ప్రభుత్వం చేసే డిమాండ్లను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. దీనివల్ల దాదాపు 900కోట్ల డాలర్ల మేరకు వర్శిటీ నిధులు ముప్పులో పడ్డాయి. యూనివర్శిటీలో యూదు వ్యతిరేక నిరసనలను కట్టడి చేయాలని, అలాగే మెరిట్ ప్రాతిపదికన ఇచ్చే ప్రవేశాలను ఆపివేయాలని, నియామక విధానాలను కూడా సవరించుకోవాలని ఇలా పలు డిమాండ్లు చేసింది.
భిన్నత్వం లేదా వైవిధ్యతపై తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరింది. పాలస్తీనా అనుకూల ఆందోళనకారులను ధరిస్తున్న ఫేస్‌మాస్క్‌లను నిషేధించాలని, నిరసనల సమయంలో యూనివర్శిటీ భవనాలను ఆక్రమించిన విద్యార్థులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే వైట్‌హౌస్ చేస్తున్న డిమాండ్లు యూనివర్శిటీకి హక్కులకు సంబంధించిన మొదటి సవరణను ఉల్లంఘిస్తున్నాయని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. టైటిల్ 4 కింద ప్రభుత్వానికి గల చట్టబద్ధమైన పరిమితులను అతిక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. మతం, రంగు, లేదా జాతిని బట్టి విద్యార్ధుల పట్ల వివక్ష ప్రదర్శించరాదని టైటిల్ 4 పేర్కొంటోంది.