- మస్క్ పట్ల ప్రజా నిరసనలపై ఆగ్రహం
- టెస్లా కారు కొంటానని ప్రకటన
- భారీగా పతనమైన టెస్లా షేర్ల ధరలు
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్)కి నేతృత్వం వహిస్తున్న ఎలన్ మస్క్‌పై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్‌కు ట్రంప్ మద్దతు ప్రకటించారు. మస్క్ నిజమైన గొప్ప అమెరికన్ అంటూ కొనియాడారు. బుధవారం ఉదయమే టెస్లా కారు కొనుగోలు చేస్తానని ప్రకటించారు. ‘రిపబ్లికన్లు, కన్సర్వేటివ్‌లు, ఘనమైన అమెరికన్లు…అందరికీ నేను చెప్పేదేమంటే మన దేశానికి సాయపడేందుకు ఎలన్ మస్క్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు. అయితే రాడికల్ వామపక్ష పిచ్చివాళ్లు తరచుగా చేస్తున్నట్లుగానే ఇప్పుడు కూడా కుమ్మక్కై ప్రపంచంలో అతి గొప్ప కార్ల తయారీ సంస్థల్లో ఒకరైన టెస్లాను చట్ట విరుద్ధంగా బహిష్కరించారు. అది ఎలన్ సంస్థ. ఎలన్‌పై దాడి చేసి ఆయనకు నష్టం కలిగించేందు కు వారు ఈ చర్యకు పూనుకున్నారు’ అని ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
గత సంవత్సరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా తనను దెబ్బ తీసేందుకు వారు ఇలాగే ప్రయత్నించారని ట్రంప్ ఆరోపించారు. కానీ అది ఫలించిందా అని ఎద్దేవా చేశారు. ఎలన్ మస్క్ పట్ల విశ్వాసం వ్యక్తపరచేందుకు, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు కొత్త టెస్లా కారును కొనుగోలు చేయబోతున్నట్లు తెలిపారు. దేశానికి ఎంతో సేవ చేస్తున్న మస్క్ ఇలాంటి పరిణామాలను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అమెరికా’కు సాయపడేందుకు తన అమోఘమైన నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్న మస్క్‌ను ఎందుకు శిక్షించాలని ఆక్రోశించారు. కాగా ట్రంప్ ప్రకటనకు ఎలన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపారు.
ఏం జరుగుతోంది?
ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ నిర్వహిస్తున్న పాత్రను వ్యతిరేకిస్తున్న అమెరికన్లు టెస్లాపై పెద్ద ఎత్తునఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని వివిధ టెస్లా కేంద్రాలు, వాహనాలపై దాడులు జరుగుతున్నాయి. నిరసనకారులు టెస్లా కేంద్రాల వద్ద శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తు న్నారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బడ్జెట్లలో కోత విధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా ప్లకార్డులు చేబూని ‘ఇక మస్క్ ఇంటికి పోవాలి’ అని నినాదాలు చేస్తున్నారు. ఇదిలావుండగా టెస్లా షేర్ల విలువ ఒక్క సోమవారం నాడే 15 శాతం పతనమైంది. గత కొన్ని సంవత్సరాల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అమెరికాను మాంద్యం ముంచెత్తబోతోందన్న వదందులు కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం మార్కెట్‌ను కుదిపేస్తోంది. 2020 తర్వాత టెస్లా షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. గత సంవత్సరం డిసెంబర్ 17న ఈ సంస్థ షేర్లు రికార్డు స్థాయిలో 479 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడు ఆ విలువ సగానికి సగం పడిపోయింది.