- రష్యా అధ్యక్షులు పుతిన్ వ్యాఖ్య
అస్తానా : అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ముప్పు నీడనే ఉన్నారని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్, ఆయన కుటుంబం అత్యంత అనాగరికమైన పద్ధతుల్లో దాడులను ఎదుర్కొనాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రియటీ ఆర్గనైజేషన్ (సిఎస్‌టిఓ) సదస్సు ముగింపు సందర్భంగా కజకస్తాన్ రాజధాని అస్తానాలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయొంలో పదే పదే ట్రంప్‌పై హత్యా యత్నాలు చోటుచేసుకున్నాయని, చిన్నారులతో సహా ట్రంప్ కుటుంబాన్ని ఇలా రాజకీయ ప్రత్యర్ధులు లక్ష్యంగా చేసుకున్నాయని, అయితే ట్రంప్ ఇప్పటికీ ముప్పు నీడనే ఉన్నారని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయనకు రక్షణ లేదన్నది తన ప్రగాఢ అభిప్రాయమని చెప్పారు. అనుభవజ్ఞుడు, మేథావి అయిన ట్రంప్ ఇలాంటి దాడలను జాగ్రత్తగా ఎదుర్కొగలరని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జులై 13న పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సందర్భంగా ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన సంగతి తెలిసిందే.