వాషింగ్టన్ : కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేసే ప్రతిపాదనను సోమవారం పునరుద్ధరించారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తన పార్టీ లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాలో వెల్లువెత్తుతున్న అసమ్మతి, ఒత్తిడి కారణంగా ట్రూడో సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రక టించిన సంగతి తెలిసిందే. కెనడాలో ఈ ఏడాది చివరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని ట్రూడో మీడియాతో వెల్లడించారు.
2017-2021 మధ్య మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ అమెరికా, కెనడాల మధ్య మెరుగైన సంబంధాలు లేవు. నవంబర్ 5న మార్-ఎ-లాగోలో ఎన్నికల విజయం అనంతరం ట్రూడో కలిసినప్పటి నుండి కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చాలనే ఆలోచలోనే ఉన్నారు. ఆ తర్వాత చాలా సార్లు సోషల్‌మీడియా పోస్ట్‌లలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు.
”కెనడాలో చాలా మంది ప్రజలు అమెరికాలో 51 రాష్ట్రంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కెనడాను అవసరమైన భారీ వాణిజ్య లోటులు, రాయితీలను అమెరికా అందించదు. ఈ విషయం తెలిసీ ట్రూడో రాజీనామా చేశారు” అని తన సోషల్‌మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు. ‘కెనడా అమెరికాతో విలీనమైతే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి. ఆ దేశాన్ని చుట్టుముట్టే రష్యా, చైనా ఓడల ముప్పును సురక్షితంగా ఎదుర్కోగలవు’ అని అన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దు నుండి అక్రమ వలసదారులు, అక్రమ డ్రగ్ ప్రవాహాన్ని కెనడా నిరోధించకపోతే ఆక్కడి దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ ప్రతిపాదననపై కెనడా స్పందించలేదు.